
కరోనా రెండో వేవ్ ఉధృతి తగ్గింది. కరోనా కేసులు ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆసుపత్రిలో బెడ్స్ దొరుకుతున్నాయి. ఆక్సిజన్ లభిస్తోంది. వ్యాక్సినేషన్ ఊపందుకుంటోంది. ఇక వచ్చేవారం నుంచి తెలంగాణాలో పగలు లాక్డౌన్ ఉండకపోవచ్చు. రాత్రిపూట కర్ఫ్యూ మాత్రం కంటిన్యూ అవుతుంది. జులై నుంచి అది కూడా ఉండదు.
అందుకే, ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’, ‘పుష్ప’, ‘అర్ ఆర్ ఆర్’, ‘సర్కారు వారి పాట’ వంటి సినిమాల షూటింగ్ లు జులైలోనే మళ్ళీ ప్రారంభం కానున్నాయి. దానికోసం ఇండస్ట్రీ అంతా రెడీ అవుతోంది. కానీ, సినిమా విడుదల విషయంలోనే ఇంకా క్లారిటీ రావడం లేదు.
రిలీజుల గురించి తర్వాత ఆలోచించొచ్చు. ముందు చివరిదశకు వచ్చిన సినిమాల చిత్రీకరణ పూర్తి చేస్తే ఓ పని అయిపోతుంది అని ఇండస్ట్రీ భావిస్తోంది. అలాగే, సినీ కార్మికులకు పని కల్పించినట్లు అవుతుంది. లేదంటే చాలామంది పస్తులుండాల్సి వస్తోంది. అందుకే, తెలుగు సినిమా బ్యాక్ టు ది సెట్స్ అంటూ ముస్తాబవుతోంది.