వ్యాక్సిన్ వస్తేనే హీరోలు వస్తారట

షూటింగులకు పర్మిషన్ ఇవ్వండి అని మే నెలలో రాజమౌళి, కొరటాల, చిరంజీవి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రభుత్వంతో చర్చలు జరిపి పర్మిషన్ తెచ్చుకున్నారు. వీళ్ల ప్రయత్నాలు ఫలించాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. మరి హీరోలెక్కడ? సరిగ్గా ఇక్కడే చిక్కొచ్చిపడింది.

ప్రభుత్వం షూటింగ్స్ కు అనుమతులు ఇచ్చినా తాము మాత్రం సెట్స్ పైకి వచ్చేది లేదంటున్నారు హీరోలు. కరోనా తగ్గేంతవరకు లేదా కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు లొకేషన్ కు వచ్చేది లేదని మొండికేస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో కీలకమైన, ప్రతిష్టాత్మకమైన సినిమాలేవీ ఇప్పటివరకు సెట్స్ పైకి రాలేదు.

రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్.. మహేష్ ప్రకటించిన సర్కారువారి పాట.. బన్నీ పుష్ప.. ప్రభాస్ కొత్త సినిమా.. ఇలా బడా సినిమాలేవీ ఇప్పట్లో సెట్స్ పైకి రావు. వ్యాక్సిన్ వస్తే తప్ప తమ హీరోలు సెట్స్ పైకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని చెబుతున్న నిర్మాతలు.. ఈ విషయంలో హీరోల్ని తప్పుపట్టడం లేదు. అంత రిస్క్ తీసుకొని ఇప్పటికిప్పుడు సినిమాల్ని సెట్స్ పైకి తీసుకురావాల్సిన అవసరం లేదంటున్నారు.

కొన్ని చిన్న సినిమాల నిర్మాతలు మాత్రం తెగించి లొకేషన్ పైకొచ్చారు. బిక్కుబిక్కుమంటూ షూటింగ్స్ స్టార్ట్ చేశారు. వీళ్లకు షూటింగ్స్ చేయడం అనివార్యం. లేదంటే తెచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టాల్సి వస్తుంది, నటీనటుల కాల్షీట్లు వేస్ట్ అయిపోతాయి. పెద్ద సినిమాల నిర్మాతలకు వడ్డీలతో సమస్య ఉన్నప్పటికీ, రికవరీ అవుతుందనే ధైర్యం ఉంది.

Advertisement
 

More

Related Stories