
త్రివిక్రమ్ మళ్లీ పెన్ పట్టాడు. అవును, ఈ రోజుకి కూడా త్రివిక్రమ్ కాగితంపై పెన్ పెట్టి స్క్రిప్ట్ లు రాస్తాడు. మిగతావారిలా టైపు చెయ్యడు. అదో అలవాటు అంతే. ఐతే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది దాని గురించి కాదు. త్రివిక్రమ్ ఇప్పుడు వేరే సినిమాలకు కూడా స్క్రీన్ ప్లే అందివ్వడం, డైలాగ్ లు రాయడం చేస్తున్నాడట.
అంటే కెరీర్ ప్రారంభంలో ఎలా ఐతే రైటర్ గా ప్రొఫెషన్ కొనసాగించాడో ఇప్పుడు “తన” వాళ్ల కోసం మళ్ళీ పెన్ పట్టి, స్క్రీన్ ప్లే, డైలాగ్ లు రాస్తున్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా యువ దర్శకుడు సాగర్ చంద్ర తీయనున్న “అయ్యపనం కోషియమ్” రీమేక్ కి డైలాగులు రాస్తున్నది త్రివిక్రమే. అలాగే, అల్లు అరవింద్ మూడేళ్ళ క్రితం హడావిడిగా అనౌన్స్ చేసి…. పక్కన పెట్టిన “రామాయణం”కి కూడా స్క్రీన్ ప్లే ఇస్తున్నాడట.
ఎందుకంటే.. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ డైరక్షన్లో సినిమా షూటింగ్ మార్చి వరకు మొదలుకాదు. ఈ గ్యాప్ లో ఆయన ఇలా తనకు కావాల్సిన వాళ్ళకి తన సహాయం అందిస్తున్నాడు.