వాటి రాకకు ఆగస్టు చివర్లోనే ఛాన్స్!

Love Story and Tuck Jagadish

కోవిడ్ కేసులు మెల్లగా మళ్ళీ పెరుగుతున్నాయి. దాంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూని పొడిగించింది. ఇప్పటివరకున్న కర్ఫ్యూని మరో రెండు వారాలు పొడిగించింది. అంటే సెకండ్ షోలు ఉండవు. తెలంగాణాలో 100 పెర్సెంట్ ఆక్యుపెన్సీతో అన్ని షోలకు అనుమతి ఉంది. కానీ ప్రధాన మార్కెట్ అయిన ఏపీలో ఇప్పుడు ఉన్న నెలకొన్న పరిస్థితుల్లో మీడియం, పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదల చెయ్యలేని పరిస్థితి.

అంటే, ఆగస్టు మూడో, నాలుగో వారం వరకు ఆగాల్సిందే. ఆగస్టు 15 నాటికి కోవిడ్ కేసులు భారీగా పెరగకపోతే… ఏపీ ప్రభుత్వం పూర్తి సడలింపులు ఇస్తుంది. అప్పుడు అన్ని సినిమాలు విడుదలకు క్యూ కట్టొచ్చు. అప్పటివరకు మీడియం, పెద్ద సినిమాలు విడుదల కావు. ఈ వీకెండ్ ‘తిమ్మరుసు’, ‘ఇష్క్’ వంటి చిన్న చిత్రాలు వచ్చాయి. వచ్చేవారం, ‘ఎస్సార్ కల్యాణ మండపం’ వంటి సినిమాలున్నాయి.

కానీ, ‘లవ్ స్టోరీ’, ‘టక్ జగదీష్’ చిత్రాల విడుదల తేదీ విషయాల్లోనే సమస్య. చాలాకాలంగా ఈ సినిమాలు ఇదిగో ఈ వారమే అదుగో వచ్చే వారం అన్నట్లుగా రెడీగా క్యూ కట్టాయి. కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు.

మరోవైపు, పలు పెద్ద సినిమాలు విడుదల తేదీలు ప్రకటించాయి. కానీ అవన్నీ, ఈ డేట్ కి పక్కాగా వస్తాయా అన్నది ఇప్పుడే చెప్పలేం. అమెరికా సహా అనేక దేశాల్లో కేసుల సంఖ్య మరోసారి పెరుగుతుంది. మళ్ళీ లాక్డౌన్ పెట్టే పరిస్థితి వస్తే అంతా తారుమారు అవుతుంది. ఇప్పుడు ప్రకటిస్తున్న డేట్స్ అన్నిటికి ‘షరతులు వర్తిస్తాయి’ అని రాసుకోవాలి.

 

More

Related Stories