
పాత కథను కొత్తగా చెప్పాలంటే ఏం చేయాలి? హీరోకు మాస్ ఎలిమెంట్స్ చొప్పించాలి. గ్రామంలో కక్షలు చూపించాలి. ఈ జనరేషన్ కు తగ్గట్టు ట్విస్టులు పెట్టాలి. “టక్ జగదీష్’ సినిమా విషయంలో ఇదే జరిగింది. పాత కథకి శివ నిర్వాణ తనదైన మార్పుచేర్పులు చేశాడు. హీరో నానిని టక్ జగదీష్ గా కంటే ఫ్యామిలీ మేన్ గా చూపించే ప్రయత్నం చేశాడు. “డబ్బు పిచ్చి ఉన్నోళ్లను చూసుంటాం, కులం పిచ్చి ఉన్నోళ్లను చూసుంటాం. ఈయనకు కుటుంబం పిచ్చి అని,” కమెడియన్ ప్రవీణ్ చెబుతాడు ఓ సన్నివేశంలో. ఈ ఒక్క డైలాగ్ లోనే నాని క్యారెక్టరైజేషన్ మొత్తం ఉంది.
పాత కథకు మార్చుచేర్పులు చేసే క్రమంలో నానికి ”టక్”ను ఆపాదించాడు నిర్వాణ. ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది కానీ, దానికి జస్టిఫికేషన్ మాత్రం అస్సలు బాగాలేదు. తప్పనిసరి పరిస్థితుల మధ్య బలవంతంగా దానికో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. నిజానికి టక్ కాన్సెప్ట్ లేకుండా, టక్ కోసం వివరణ ఇచ్చే సీన్ లేకుండా కూడా ఈ సినిమాను తీయొచ్చు. అంతలా అతుకుల బొంత అనిపిస్తుంది ఈ కాన్సెప్ట్.
సింపుల్ గా కథను చెప్పుకుందాం.. భూదేవిపురం అనే ఊరిలో ఆదిశేషగిరి నాయుడు (నాజర్) అనే పెద్ద మనిషిది పెద్ద కుటుంబం. ఆయనకు ఇద్దరు భార్యలు. పెద్ద కొడుకు బోస్ (జగపతి బాబు), చిన్న కొడుకు టక్ జగదీశ్ (నాని)తో పాటు మరో ఇద్దరు అక్కలు. ఊరిలో ఆదిశేషగిరి నాయుడు కుటుంబానికి వీరేంద్ర (డేనియల్ బాలాజీ) కుటుంబానికి పడదు. ఓ ప్రాజెక్టుకు సంబంధించి రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్న క్రమంలో హఠాత్తుగా ఆదిశేషగిరి మరణిస్తాడు. కుటుంబంతో పాటు ఊరు బాధ్యతల్ని బోసు తీసుకుంటాడు. అయితే తండ్రి చనిపోయిన తర్వాత బోస్ అసలు రంగు బయటపడుతుంది. వీరేంద్ర కొడుకుతో చేతులు కలుపుతాడు. మేనకోడల్ని (ఐశ్వర్యరాజేష్) శత్రువు కుటుంబానికి కోడలిగా పంపిస్తాడు. అక్కచెల్లెళ్లని ఇంట్లోంచి తరిమేస్తాడు. ఊరిలో భూముల్ని తన పేరిట రాయించుకుంటాడు. ఇలాంటి టైమ్ లో టక్ జగదీష్ ఏం చేశాడు? అన్నలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాడు? కుటుంబం మొత్తాన్ని తిరిగి ఎలా ఒక్కటి చేశాడు? అనేది బ్యాలెన్స్ కథ.
ఇంతకుముందే చెప్పుకున్నట్టు పాత కథకు కొత్తదనం ఇచ్చే క్రమంలో హీరోకు చాలా బాధ్యతలు అంటగట్టాడు దర్శకుడు. మేనకోడల్ని రక్షించడం, అన్నను మార్చడం, ఊరిలో భూతగాదాల్ని పరిష్కరించడం, కుటుంబాన్ని ఒక్కటి చేయడం లాంటివి నాని భుజాలపై పెట్టాడు. బహుశా బాధ్యతలు ఎక్కువయ్యాయని భావించాడేమో.. హీరోయిన్ కు మాత్రం కష్టాలు పెట్టలేదు. కాసేపు అయ్యాక హీరోయిన్ పాత్ర సైడ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే హీరోయిన్ పాత్రకు కథకు సంబంధం లేకుండా పోయింది.
ఇంట్లో ఆడపిల్లని ఏడిపించకూడదనే పాయింట్ ను శివ నిర్వాణ గట్టిగా పట్టుకున్నాడు. నిజానికి అతడి బలం కూడా అదే. సినిమా మొత్తం ఈ ఎమోషన్ ను పండించడంలో శివ సక్సెస్ అయ్యాడు. మరీ ముఖ్యంగా ఈసారి కథ కంటే నానినే ఎక్కువగా నమ్ముకున్నాడు దర్శకుడు. అయితే ఈ క్రమంలో కొత్త సన్నివేశాలు రాసుకోకుండా, ఫార్ములానే నమ్ముకున్నాడు. దీంతో సీన్ బై సీన్ అంతా తెలిసిపోతుంటుంది. దీనికితోడు నెరేషన్ కూడా 90ల నాటి సినిమాల్ని తలపించింది. ఉదాహరణకు మేనకోడల్ని రక్షించేందుకు ఆమె ఇంటిపై బల్బు పెట్టి, రిమోట్ కంట్రోల్ చేతికిస్తాడు. అంత చేసేబదులు మొబైల్ నుంచి ఫోన్ చేసి ఉంటే సరిపోయేది.
దీంతో పాటు గ్రామంలో మార్పు కోసం హీరో చేసే పనులు కూడా పాత సినిమాల్ని గుర్తుకుతెస్తాడు. నాని భోజనం ఎపిసోడ్, పొలం ఫైట్లు చూస్తే కొరటాల శివ సినిమాలు గుర్తొస్తాయి. మరీ ముఖ్యంగా సినిమా ఫస్టాఫ్ మొత్తం “క్షత్రియ పుత్రుడు” తరహాలో సాగుతుంది. ఇలా పూర్తిగా ఫార్ములాను నమ్ముకొని తీశాడు శివనిర్వాణ.
అయితే ఇలాంటి ఫార్ములా సినిమాను కూడా తన భుజాలపై మోశాడు నాని. కథ రొటీన్ అని తెలిసినప్పటికీ ఆద్యంతం సినిమా చూశామంటే దానికి కారణం నాని మాత్రమే. జగపతిబాబు ఎప్పట్లానే రెండు డిఫరెంట్ షేడ్స్ చూపించి సక్సెస్ అయ్యాడు. మేనకోడలు పాత్రలో ఐశ్వర్యరాజేష్ బాగానే చేసింది. ఐతే, రీతూవర్మ గురించి చెప్పుకోడానికేం లేదు. ఇంట్రడక్షన్ లో ఎక్కువ బిల్డప్పు ఉంటుంది ఆ పాత్రకి. తర్వాత ఉండదు. మిగతా నటీనటులంతా తమ పాత్రల మేరకు నటించారు. టెక్నికల్ గా గోపీసుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ తమన్ పాటలు సాధారణంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, శివనిర్వాణ మాటలు బాగున్నాయి. సినిమాకు ట్రిమ్మింగ్ ఇంకాస్త ఎక్కువ అవసరం.
ఓవరాల్ గా “టక్ జగదీష్” సినిమా పాత ఫ్యామిలీ చిత్రాల్ని తలపిస్తుంది. కొత్తదనం లేకపోయినా, నెరేషన్ స్లోగా ఉన్నప్పటికీ.. నాని తన భుజాలపై ఈ సినిమాను ఒడ్డుకు చేర్చాడు.
Rating: 2.75/5