
ఉదయ్ కిరణ్ సినిమా ఒకటి ఇంకా రిలీజ్ కాలేదు. అదింకా పెండింగ్ లోనే ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. మరికొంతమంది మరిచిపోయి ఉంటారు. ఉదయ్ కిరణ్ నటించిన ఆఖరి సినిమా “చిత్రం చెప్పిన కథ”. ఇప్పుడీ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి.
సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో టాలీవుడ్ లో మరోసారి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య హాట్ టాపిక్ గా మారింది. దీనికితోడు లాక్ డౌన్ వల్ల ఓటీటీలో సినిమాలకు డిమాండ్ పెరిగింది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడంతో.. ఏడేళ్ల కిందటి ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ మేరకు ఒకట్రెండు ఓటీటీ సంస్థలను వీళ్లు సంప్రదించారు.
ఉదయ్ కిరణ్ సినిమాను తీసుకోవడానికి చాలా ఓటీటీలు సిద్ధంగా ఉన్నాయి. కానీ చిక్కంతా నిర్మాతలతోనే వస్తోంది. ఉదయ్ కిరణ్ మరణంతో పాటు, ఫైనాన్షియల్ సమస్యలు ఈ సినిమాను ఇబ్బందుల్లో నెట్టాయి. ఇప్పటికిప్పుడు ఈ సినిమాను ఓటీటీకి అమ్మినా ఆర్థిక కష్టాలు తీరవని చెబుతున్నారు.
అసలీ సినిమా ఇన్నాళ్లూ రిలీజ్ చేయకపోవడానికి కూడా మెయిన్ రీజన్ ఆర్థిక చిక్కులే. ఈ లాక్ డౌన్ టైమ్ లోనైనా ఉదయ్ కిరణ్ నటించిన చిట్టచివరి సినిమాకు మోక్షం లభిస్తుందేమో చూడాలి.