ఉస్తాద్ లో పూజనేనా?


దర్శకుడు హరీష్ శంకర్, హీరోయిన్ పూజ హెగ్డేలది హిట్ కాంబినేషన్. ఇంకా చెప్పాలంటే, ఆమెకి తెలుగులో క్రేజ్ రావడానికి మొదటి కారణం హరీష్. “డీజే దువ్వాడ జగన్నాధం”లో ఆమెని యమా గ్లామరస్ గా చూపించి అందరి చూపు పూజ వైపు పడేలా చేశాడు ఈ ‘గబ్బర్ సింగ్’ డైరెక్టర్.

ఆ తర్వాత ‘గద్దలకొండ గణేష్’లో ఆమెకి మెయిన్ పాత్ర ఇచ్చి… శ్రీదేవి సూపర్ హిట్ సాంగ్ ని ఆమెపై చిత్రీకరించాడు హరీష్ శంకర్. ఇక ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాలో కూడా పూజనే హీరోయిన్ అని రెండేళ్ల క్రితం ప్రకటించాడు. ఐతే, రెండేళ్ల తర్వాత పరిస్థితి మారింది. ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా స్థానంలో ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వచ్చింది.

కథ మారింది, బ్యాక్ డ్రాప్ మారింది. హీరో మాత్రం పవన్ కల్యాణే. మరి హీరోయిన్ పూజ హెగ్డే ఉంటుందా? మరొకరా? ఇదే ఇప్పుడు అందరిలో కలుగుతున్న ప్రశ్న.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ నిన్న (డిసెంబర్ 11) లాంఛనంగా లాంచ్ అయింది. కానీ, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో క్లారిటీ లేదు. పైగా, పవన్ కళ్యాణ్ సినిమాకి ఇచ్చిన డేట్స్ ఎప్పుడైనా మార్చేస్తారు. తన పొలిటికల్ షెడ్యూల్ ని బట్టి షూటింగ్ పెట్టుకుంటారు. ఒక ఫిక్సెడ్ డేట్స్ ఉండవు. అలాంటప్పుడు పూజ హెగ్డే లాంటి పెద్ద హీరోయిన్ పవన్ కళ్యాణ్ పక్కన చెయ్యగలుగుతుందా?

పవన్ కళ్యాణ్ రాజకీయ షెడ్యూల్ ని బట్టి షూటింగ్ పెట్టుకుంటే పూజ హెగ్డే కూడా తన డేట్స్ మార్చగలదా?

ఆమె కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన నటిస్తోంది. మరో పెద్ద సినిమాలో నటిస్తూ ఇంకో సినిమాకి డేట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవడం కష్టమే. అందుకే, పూజ హెగ్డే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది.

 

More

Related Stories