ఉత్తరాంధ్ర గద్దర్… వంగపండు

Vangapandu Prasada Rao

వంగపండు ప్రసాదరావు అంటే ఒక ఉరిమే ఉత్సాహం… ఉరకలెత్తే ఉత్తేజం.

ఆ గొంతు వినగానే ఉద్యమ స్ఫూర్తి రగులుతుంది. ఆ పాట తాడిత పీడిత వర్గాలను చైతన్యపరచి పోరాడమని చెబుతుంది. ఆ మాట కార్మికుడి కష్టాన్ని…. కర్షకుడి స్వేదాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. నా కళను కాసులకు అమ్ముకోలేదు అని రొమ్ము విరిచి చెప్పగలిగిన నిజమైన కళాకారుడు… రచయిత వంగపండు ప్రసాదరావు. 

ఉత్తరాంధ్రలోని పెద్దబొండపల్లి అనే కుగ్రామం నుంచి వచ్చిన వంగపండు ఊళ్ళో రైతాంగం, రైతు కూలీల ఈతిబాధలు తెలిసినవాడు. వర్ణ వివక్షను కళ్ళారా చూసినవాడు. తను పెరిగిన వాతావరణంలోని చెట్టుచేమల్ని ప్రేమించాడు. కూలీనాలీ చేసుకొనేవారు తమ కష్టాన్ని మరచిపోయేందుకు పాడుకున్న జానపదాల్ని ఒడిసిపట్టుకున్నాడు. వాటి ఆలంబనతోనే పాటలు అల్లాడు. ఆడిపాడాడు. ఆ పాటను తన జనం చైతన్యం కోసం ప్రయోగించాడు. ఏ ఉద్యోగం వచ్చినా కుదురుకోలేదు. కారణం ఉంది…

జానపదంలో కమ్యూనిజం!

వంగపండు ప్రసాదరావు యువకుడిగా ఉన్నప్పుడే చారుమజుందారు నక్సల్బరీ పోరాటం ఆలోచింపచేసింది. ఎక్కడో బెంగాల్లో పుట్టిన నక్సల్బరీ ఉద్యమం సిక్కోలు సీమను తాకితే- వెంపటాపు సత్యం, సుబ్బారావు పాణిగ్రాహి, ఆదిభట్ల కైలాసం లాంటి వాళ్ళు ముందుకు తీసుకువెళ్లారు. వారి ప్రభావం 70ల నాటి యువతను కదిలించింది. అలా ఉద్యమ స్ఫూర్తిని అక్షరీకరించి పాటగా జనంలోకి తీసుకువెళ్లారు వంగపండు ప్రసాదరావు. పీపుల్స్ వార్ కి అనుబంధంగా జన నాట్యమండలిని స్థాపించడంలో గద్దర్ తో కలిసి కీలక భూమిక పోషించింది వంగపండు ప్రసాదరావు. 

ఆ రోజుల్లో పార్వతీపురంలో నిర్వహించిన సభలో ఆయన ‘ఏం పిల్లడో ఎల్దు మొస్తవా…. ఏం పిల్లో ఎల్దా మొస్తవా…’ పాట పాడితే జనమే కాదు ఆ వేదికపై ఉన్న మహాకవి శ్రీశ్రీ కూడా ఉర్రూతలూగిపోయారు. ఇటు శ్రీకాకుళం నుంచి అటు తెలంగాణ, రాయలసీమ వరకూ సాగుతున్న ఉద్యమాలను అందులో చూపించారు. . భూస్వాములు, వారు నడిపే రాజ్యాన్ని తాడిత పీడత వర్గాలు ఎలా ఎదుర్కొంటున్నాయో కళ్లకుకట్టారు.

పోరాడితే పోయేదేమీ లేదు… అనే వాస్తవాన్ని చెప్పిన విధానం ఎన్ని తరాలనైనా ఉత్తేజితం చేస్తాయి. “…సిలకలు… బల్ సిలకలు సిలకలు కత్తులు జులపరిస్తవి…/ బల్లెం, చల్ బల్లెం బల్లెం పట్టిన నల్లూలున్నవి/ తుపాకీ, చల్ తుపాకీ అరె తుపాకీ పట్టిన తూనీగలున్నవి..” లాంటి మాటలు చూస్తే బలహీనులు ధైర్యం చేసి ఒక సమూహంగా కదిలితే ఎంతటి బలవంతుడైనా నెలకొరగాల్సిందే అనే కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని జానపదంలో చెప్పారు.

వెండితెరపై జజ్జనకరి 
 
‘80ల్లో ఆ పాట లేకుండా ఏ ఉద్యమ సమావేశం ముగిసేది కాదు… ఈ ట్రేడ్ యూనియన్ సభ పూర్తయ్యేది కాదు. ఆ తరవాత ఆర్.నారాయణమూర్తి తన “అర్థరాత్రి స్వతంత్రం” సినిమాలో ‘ఏం పిల్లడో…’ పాటను ఉపయోగించుకున్నారు. ఈ గీతంలో నర్తించింది ఎవరో కాదు నాటి ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ. 

వంగపండు. కార్మిక  పక్షపాతి అని చెప్పడానికి ‘యంత్రమెట్టా నడుస్త ఉందంటే…’ పాట ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ గీతం దాదాపు పది భాషల్లోకి తర్జుమా అయింది. ఈయన “అర్థరాత్రి స్వతంత్రం” కంటే ముందు మాదాల రంగారావు, టి.కృష్ణ తదితరుల చిత్రాలకు పాటలు రాశారు. ‘జజ్జనకర జనారే…’ పాపులర్ గీతం వంగపండు కలం నుంచి వచ్చిందే. అలాగే టి.కృష్ణ దర్శకత్వంలో వచ్చిన “రేపటి పౌరులు” చిత్రంలో “అయ్యా నే చదివి బాగుపడతా…” పాటలో నిరుద్యోగ సమస్యను ఎత్తి చూపిన వైనం ఆలోచింపచేస్తుంది. పోరు తెలంగాణ చిత్రంలో ‘జ్ఞానం ఒకడి సొత్తు కాదన్నా… అది సర్వ జాతుల సంపద ఓరన్నా’ పాటలో చాతుర్వర్ణ వ్యవస్థను చాలా బలంగా నిరసించారు. పురాణేతిహాసాల నుంచి వర్తమానం వరకూ దళిత, నిమ్న, బడుగు జాతులు వారిలో ఎంతటి గొప్పవారు ఉన్నారో చెప్పారు. “గుర్రం జాషువా మహాకావ్యం రాయలేదా… ఎన్ని నేర్చినా అర్జునుణ్ణి ఏకలవ్యుడు తన్నలేదా… దళిత బిడ్డ అంబేడ్కర్ రాజ్యాంగం రాయలేదా…” అంటూ ఎలుగెత్తి చాటారు. కులవృత్తుల వారి నైపుణ్యాలను అక్షరాల్లో పొదిగారు. 

వంగపండు పాటల్లోని మాటల్లో జీవం ఉట్టిపడుతుంది. అర్థం కానీ పద గాంభీర్యం అనేది సోకని స్వచ్ఛమైన మట్టి పాట ఆయనది. ఆయన వేర్వేరు సందర్భాల్లో రాసుకున్న పాటలను కొన్ని సినిమాలకు ఉపయోగించుకున్నారు.

ఆయన్ని కేవలం ఒక ప్రజా గీతాల రచయితగానో, వాటిని పాడే గాయకుడుగానో చూడకూడదు. వంగపండు ప్రజా సమస్యలను రంగస్థలం మీదకు తీసుకువచ్చిన నాటక రచయిత. పోరాటాలపై ఆయన రాసిన ‘అడవి దివిటీలు’ అనే నాటకాన్ని సత్యానంద్ (పవన్ కల్యాణ్, ప్రభాస్ లాంటి స్టార్లకు నటన నెరిపిన గురువు) దర్శకత్వంలో వందల వేదికలపై ప్రదర్శించారు. అలాగే ‘భూ బాగోతం’ అనే నృత్య రూపకాన్ని కమ్యూనిస్ట్ పార్టీలు తమ వేదికలపై ప్రదర్శించాయి. వంగపండు రాసిన పలు విప్లవ గీతాలు ప్రైవేట్ క్యాసెట్లుగా మార్కెట్లోకి వచ్చాయి. పదేళ్ళ కిందట ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి తన వేల్ రికార్డ్స్ ద్వారా వంగపండు గీతాలు అనే సీడీని విడుదల చేశారు.

కళింగాంధ్ర మాండలికానికి పట్టం!

గత అయిదు దశాబ్దాలుగా ప్రజా సమస్యలను… కార్మికలోకం కష్టాలను… కూలన్నల బాధలను వెలుగులోకి తెచ్చి ప్రజా గొంతుకగా నిలిచారు వంగపండు ప్రసాదరావు. కళింగాంధ్ర మాండలికానికి పట్టం కట్టి పాట పాడారు. ఆయన ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ఒక గద్దర్. వంగపండు ఈ రోజు భౌతికంగా ఈ లోకంలో లేకపోవచ్చు. పెట్టుబడిదారుల కబంధ హస్తాల్లో మగ్గిపోయే సమాజం ఉన్నంతకాలం పోరాడమని చెప్పే ‘ఏం పిల్లడో…’ పాట వినిపిస్తూనే ఉంటుంది. యంత్ర భూతముల కోరలు తోమే ప్రతి కార్మికుడి గుండెల్లో ‘యంత్రమెట్టా నడుస్త ఉందంటే…’ పాట మోగుతూనే ఉంటుంది. వంగపండు లేకపోయినా ఆయన పాట జీవించే ఉంటుంది.

Advertisement
 

More

Related Stories