వారసుడు కథపై పుకార్లు

Vaarasudu

తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తీస్తున్న చిత్రానికి… వారసుడు అనే పేరు ఖరారు చేశారు. తెలుగులో ‘వారసుడు’, తమిళంలో ‘వరిసు’. ఈ టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటి నుంచి ఈ సినిమా కథ గురించి రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తానే తీసిన ‘బృందావనం’ సినిమా కథని అటు, ఇటు మార్చి తీస్తున్నాడని మొదట చర్చ జరిగింది.

ఐతే, కొన్ని తమిళ వెబ్ సైట్లు తాజాగా రాసిన స్టోరీలైన్ విని తెలుగు సినిమా లవర్స్ షాక్ కి గురి అవుతున్నారు. తమిళ వెబ్ సైట్లు రాసిన కథ ఏంటంటే… “తన తండ్రిని చంపి తమ కంపెనీని కైవసం చేసుకోవాలనుకునే వారి భరతం పట్టేందుకు అజ్ఞాతంలో ఉన్న కొడుకు అడుగుపెడతాడు. అతనే సిసలైన వారసుడు అని ప్రూవ్ చేసుకుంటాడు.” ఈ కథ చదవగానే ఆల్రెడీ తెలుగులో త్రివిక్రమ్ “అజ్ఞాత వాసి”, సుజీత్ “సాహో” అనే “కళాఖండాలు”వచ్చాయి కదా అని తెలుగు సినిమా లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

“లార్గోవించి” అనే ఫ్రెంచి సినిమాని కాపీ కొట్టి ఆ రెండు సినిమాలను తీశారు తెలుగులో. తెలిసీ తెలిసీ వంశీ పైడిపల్లి అలాంటి కథ ఎంచుకుంటాడా? నిర్మాత దిల్ రాజు ఓకే అంటాడా? అన్న అనుమానాలు కలుగుతాయి.

Vamshi Paidipally and Vijay

ఈ సినిమా అటు వంశీ పైడిపల్లికి, ఇటు విజయ్ కి, నిర్మాత దిల్ రాజుకి కీలకం. విజయ్ ఈ సినిమాతో తెలుగులో మార్కెట్ పెంచుకోవాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది ఈ మూవీ. ఇక పైడిపల్లికి ఈ సినిమా హిట్ అయితేనే తెలుగులో మరో పెద్ద హీరో అవకాశం ఇస్తాడు. దిల్ రాజ్ తమిళంలో మరిన్ని పెద్ద సినిమాలు నిర్మించాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇవన్నీ వర్కవుట్ కావాలంటే ఈ మూవీ పెద్ద హిట్ కావాలి.

ఇలాంటి కీలకమైన సినిమాకి పాచిపోయిన కథ తీసుకుంటారా? కాబట్టి ఈ పుకార్లలో నిజం లేదనే అనుకోవాలి. పైడిపల్లి టీం మాత్రం ఇవన్నీ తప్పు అంటోంది. తమ కథ అది కాదు అన్నట్లుగా చెప్తోంది ఆయన టీం.

 

More

Related Stories