వరుడు కావలెను – తెలుగు రివ్యూ

Varudu Kaavalenu

“ప్రేమకథలన్నీ రొటీన్ గానే ఉంటాయి. ఆ ప్రాసెస్ ను ఎంత కొత్తగా చెప్పాం అనే విషయంపైనే విజయం ఆధారపడి ఉంటుంది.” ప్రమోషన్స్ లో భాగంగా నాగశౌర్య చెప్పిన మాట ఇది. అతడు ఆ మాట ఎందుకన్నాడో, ఈరోజు రిలీజైన వరుడు కావలెను సినిమా చూస్తే బాగా అర్థమౌతుంది. ఈ సినిమా కథలో ఆవగింజంత కొత్తదనం కూడా కనిపించదు. ఈ విషయంలో డైరక్టర్ లక్ష్మీసౌజన్య ప్రయోగాలు చేయదలుచుకోలేదు.

Advertisement

అందరికీ తెలిసిన కథనే ఎంత అందంగా, ఇంట్రెస్టింగ్ గా చూపించొచ్చు అనే కోణంలోనే వర్క్ చేశారు. బాగా తెలిసిన కథకే ఫిమేల్ సెంట్రిక్ టచ్ ఇచ్చి టార్గెట్ ని కొంతమేరకు అందుకున్నారు. సున్నితమైన ప్రేమభావాలు, అమ్మాయిల భావోద్వేగాల్ని ఈ సినిమాలో అందంగా చూపించారు.

అన్ని ప్రేమకథల్లానే “వరుడు కావలెను” సినిమా కూడా రొటీన్ గా స్టార్ట్ అవుతుంది. ఓ ఎన్నారై కుర్రాడు, ఓ దేశీ అమ్మాయి ఫార్ములాలోనే కథ సాగుతుంది. గంట తర్వాత అసలు మేటర్ రివీల్ చేశారు డైరక్టర్. అలా సినిమా ఊపందుకోవడం కాస్త ఆలస్యమైంది. అయితే మెయిన్ పాయింట్ ను అందుకున్న తర్వాత అదే టెంపోను కొనసాగించలేకపోయారు సౌజన్య. లవ్ సీన్స్, ఎమోషనల్ సీక్వెన్సులు బాగానే దట్టించినప్పటికీ.. నెరేషన్ నెమ్మదిగా మళ్లీ పట్టాలపైకి వచ్చినట్టు అనిపిస్తుంది.

హీరో నాగశౌర్యకు ఏ పాయింట్ అయితే కొత్తగా అనిపించి ఈ సినిమా ఒప్పుకున్నాడో, అదే పాయింట్ ను ప్రేక్షకులు కూడా కొత్తగా ఫీల్ అవుతారు. కాలేజ్ డేస్ లో హీరోహీరోయిన్లు విడిపోవడం, ఆ ప్రాసెస్ ను కాస్త కొత్తగా చూపించారు. ఆ ఎపిసోడ్స్ ను డైరక్టర్ బాగా డీల్ చేశారు. దీనికితోడు ఫ్యామిలీ ప్రేక్షకులను కట్టిపడేసేలా కూతురుపై మురళీశర్మ చెప్పే డైలాగ్ లు, క్లైమాక్స్ లో నదియాతో ఇచ్చిన ట్విస్ట్ ను బాగా తీశారు.

సినిమాలో డైలాగ్స్ బాగున్నాయి. తొలిసారి అధికారికంగా డైలాగ్ రైటర్ కార్డు వేయించుకున్న ప్రముఖ సినీ సమీక్షకుడు గణేశ్ రావూరి, తన తొలి సినిమాతో అందర్నీ ఆకట్టుకున్నాడు. మురళీ శర్మ ఎపిసోడ్ లో, ప్రీ-క్లైమాక్స్ లో వచ్చే హీరోహీరోయిన్ ఎపిసోడ్ లో గణేశ్ డైలాగ్స్ గుచ్చుకుంటాయి. ల్యాగ్ కామెడీ ఎపిసోడ్  కూడా బ్రహ్మాండంగా రాసి తన పెన్ను పదును చూపించాడు గణేశ్.

అయితే ల్యాగ్..ల్యాగ్ అంటూ ఏ కామెడీనైతే తెరపై అద్భుతంగా పండించారో సినిమాకు అదే ల్యాగ్ ప్రధాన సమస్యగా మారింది. చాలా స్లోగా సాగే కథనం ఇబ్బంది పెడుతుంది. అసలే రెగ్యులర్ కథ, స్క్రీన్ ప్లే వరుడ్ని వెనక్కి లాగుతుంది. రెండు భాగాల్లో కామెడీ పార్ట్ హైలెట్ గా నిలిచింది.

ఆకాష్ గా నాగశౌర్య పెర్ ఫెక్ట్ గా సూటయ్యాడు. భూమిగా సీరియస్ లుక్స్ లో రీతూవర్మ కూడా బాగా చేసింది. కాకపోతే బాగా పేలాల్సిన “దిగు దిగు దిగు నాగ” సాంగ్ లో ఆమె డాన్స్ మరీ తీసికట్టుగా ఉంది. ఆడియోగా హిట్టయిన ఆ పాట, వీడియోలో మాత్రం తేలిపోయింది. మురళీశర్మ, నదియ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సప్తగిరి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎప్పట్లానే నదియా పాత్ర ఎగ్రెసివ్ గా ఉంటుందని భావించి వెళ్లే ఆడియన్స్ కు ఈ సినిమా చిన్న షాక్ ఇవ్వడం గ్యారెంటీ.

టెక్నికల్ గా చూస్తే ముందుగా వంశీ పచ్చిపులుసు గురించే మాట్లాడుకోవాలి. అతడి సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలిచింది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు గణేశ్ మాటలు, రెండు పాటలు సినిమాకు హెల్ప్ అయ్యాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో లక్ష్మీసౌజన్య డైరక్షన్ బాగా ఎలివేట్ అయింది.

బాటమ్ లైన్: ఓవరాల్ గా “వరుడు కావలెను” సినిమా రొటీన్ కథతోనే తెరకెక్కినప్పటికీ.. సెన్సిబుల్ రైటింగ్, డైరక్షన్, డైలాగ్స్ తో డీసెంట్ వాచ్ మూవీ అనిపించుకుంది. స్లోగా సాగే కథనం, బలమైన కాన్ ఫ్లిక్ట్ లేకపోవడం ఇబ్బంది కలిగిస్తుంది.

Rating: 2.75/5

పంచ్ పట్నాయక్

Advertisement
 

More

Related Stories