
యంగ్ హీరోలు ఏం చేసినా చెల్లుతుంది.. కానీ సీనియర్ హీరోలు అలా కాదు. వారి వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకోవాలి.. అలా చేస్తేనే ఇప్పట్లో సినీ ప్రియులు, ఫ్యాన్స్ ఆదరిస్తారు. లేదంటే కథ వేరేలానే ఉండిపోతుంది. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కూడా ఇప్పుడు చేస్తున్నది అదే. ఇక విక్టరీ వెంకటేష్ కూడా దీనికేం తీసిపోలేదు. సినిమాల స్పీడును బాగా తగ్గించేసి వయసుకు తగిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నారు.
‘దృశ్యం’ సిరీస్ కానీ, ‘నారప్ప’ మూవీ అయినా.. ‘ఎఫ్ 2’ వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘జిగర్తాండ’ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కిన జిగర్తాండ డబల్ ఎక్స్ దీపావళి కానుకగా నవంబర్ 10న రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో కార్తీక్ సుబ్బరాజ్‌ని ప్రశంసలతో ముంచెత్తారు.
ఈ ప్రశంసలతో వెంకీ వీరాభిమానుల్లో ఎందుకనే అనుమానం మొదలైంది. వెంకీ కోసం కార్తీక్ సుబ్బరాజు ఏమైనా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తాయి. రెడీ చేస్తున్నారో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజుతో పని చేయాలనే కోరిక వెంకీ మనసులో బలంగా ఉందని టాక్ మొదలైంది. నిజానికి కార్తీక్ సుబ్బరాజు స్టైల్ కాస్త వేరుగా ఉంటుంది. టెక్నికల్‌గా కూడా ఆయనది మంచి హ్యాండ్ కావడంతో వెంకీ ఆయనతో సినిమా చేసేందుకు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.
ఇక వెంకీ కూడా అయితే కమర్షియల్ లేదంటే ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్లకు మాత్రమే ఇటీవలి కాలంలో ప్రాధాన్యం ఇస్తున్నారు. మరి వెంకీని కార్తీక్ సుబ్బరాజు మెప్పించగలరా? అసలు వెంకీ వ్యాఖ్యలు సాధారణంగా వచ్చినవా? లేదంటే కావలనే ప్రశంసలు గుప్పించారా? మరికొద్ది రోజులు ఆగితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.