
కేవలం హీరోగానే కాకుండా విజయ్ దేవరకొండ నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోగా ఎలాంటి స్క్రిప్టులు వినడం లేదని, నిర్మాతగా కొన్ని కథలు వింటున్నానని ఆమధ్య ప్రకటించాడు విజయ్ దేవరకొండ. దీన్ని ఆసరాగా చేసుకొని అతడి పేరిట నకిలీ కాస్టింగ్ కాల్స్ పుట్టుకొచ్చాయి.
విజయ్ దేవరకొండ నిర్మాతగా చేయబోయే సినిమాలో నటించే అవకాశం పొందండి అంటూ కొన్ని ఫేక్ సంస్థలు కాస్టింగ్ కాల్ కు పిలుపునిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలైతే ఏకంగా విజయ్ దేవరకొండ సరసన నటించే ఛాన్స్ అంటూ కాస్టింగ్ కాల్స్ ఇచ్చాడు. వీటిపై విజయ్ దేవరకొండ టీమ్ స్పందించింది.
“విజయ్ దేవరకొండతో సినిమాలు తీస్తున్నామని కొన్ని కంపెనీలు ప్రకటిస్తూ.. క్యాస్టింగ్ కాల్‌ను నిర్వహిస్తోన్నట్టు మాకు తెలిసింది. అందులో ఎలాంటి వాస్తవాలు లేవు. ఏదైన కొత్త చిత్రం ప్రారంభిస్తే విజయ్ దేవరకొండ లేదా నిర్మాతలు ప్రకటిస్తారు. విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ఖాతాల్లో వాటిని ప్రకటిస్తాం.” అంటూ అతడి టీమ్ రియాక్ట్ అయింది.
నకిలీ కాస్టింగ్ కాల్ కు పిలుపునిచ్చిన సంస్థలు, కొన్ని పోర్టళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని యూనిట్ హెచ్చరించింది.