‘లాల్’ ఫ్లాప్…విజయశాంతి ఆనందం!

- Advertisement -
Laal Singh Chaddha


అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాపై బీజేపీ, ఆ పార్టీ భక్తులు కక్షగట్టిన విషయం మనకి తెలుసు. అమీర్ ఖాన్ సినిమాని బాయ్ కట్ చెయ్యాలని బీజేపీ, బీజేపీ భక్తులు, నాయకులు సోషల్ మీడియాలో పెద్ద ట్రెండ్ నడిపారు. అమీర్ ఖాన్ మూవీ ఇప్పుడు అపజయం పాలు అయింది. దాంతో, మాజీ హీరోయిన్, బీజేపీ నాయకురాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తమ పిలుపును అందుకొని హిందువులందరూ ఈ సినిమాని చూడకుండా మంచి పని చేశారని ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

“హిందూ ధర్మం పట్ల వ్యతిరేకత. హిందువులంటే చులకన భావంతో వ్యాఖ్యలు చేస్తూ సినిమాలు తీసే ఆమీర్ ఖాన్ చిత్రం లాల్ సింగ్ చద్దా ఇప్పుడు ఇప్పుడు కూలబడి కుదేలైంది. దేశవ్యాప్తంగా ఉన్న బాలీవుడ్ సినిమా ప్రేక్షకులు ఆమీర్ నైజం తెలుసుకుని ఆయన సినిమాలంటే అసహ్యించుకుంటున్న నేపథ్యంలో ఏం జరగబోతోందో గ్రహించి… కనీసం పెట్టుబడైనా తిరిగి తెచ్చుకోవడానికి…దక్షిణాది రాష్ట్రాల మీద… విదేశీ మార్కెట్ మీదే ఆధారపడ్డాడు. టాలీవుడ్ ప్రముఖ హీరోలు ఎంత ప్రమోట్ చేసినా లాల్ సింగ్ పప్పులు ఉడకలేదు,” అని ఆమె ట్వీటారు.

Vijayashanti

“పాకిస్తాన్‌కి వంత పాడుతూ… ఉగ్రవాదానికి నిధులిచ్చే టర్కీ దేశానికి అభిమాని అయిన ఆమీర్ ఖాన్ సినిమా టికెట్ డబ్బుల్ని… పేదల కోసమో, మరో మంచి ప్రయోజనానికో ఉపయోగించాలన్న… మాలాంటి అసంఖ్యాక జాతీయవాదుల పిలుపును అందిపుచ్చుకుని తగిన రీతిలో స్పందించారు. అంతేకాదు, తన సినిమాలు చూస్తే చూడండి, లేకుంటే లేదన్న లాల్ సింగ్ హీరోయిన్ కరీనా కపూర్ వ్యాఖ్యల్లోని…అహంకారాన్ని కూడా అర్ధం చేసుకున్నారు. ప్రజల్ని అమాయకులుగా భావించి ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తే… ఫలితాలు ఇలాగే ఉంటాయని గ్రహించాలి,” అని అన్నారు.

తాను కూడా ఒక నటిని అనే విషయాన్ని మర్చిపోయారు విజయశాంతి.

 

More

Related Stories