కాలమే చెప్పాలి…విజయశాంతి మాట

Vijayashanti

విజయశాంతి కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరనున్నారని కొంతకాలంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై రాములమ్మ స్పందించకుండా మౌనంగా ఉంది. ఐతే, రెండు రోజుల క్రితం కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మణికం టాగోర్ ఆమెని కలిసి చర్చలు జరిపారు. కాంగ్రెస్ లో ఆమె కోరుకున్న ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పుడు ఆమె స్పందించింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ …అధికార టిఅరెస్స్ పార్టీకి సవాల్ విసిరే స్థాయికి వచ్చింది అన్న వార్తల నేపథ్యంలో ఆమె ట్వీట్స్ వేసింది. కాంగ్రెస్ ని వీక్ చేసి …బీజేపీకి ఊపిరి అందించి.. తన గోతి తానే తవ్వుకున్నారని విజయశాంతి విమర్శించింది.

“ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్ గారికి సరిగ్గా వర్తించే సమయం సమీపించింది. కాంగ్రెస్ నేతలు కొందరిని ప్రలోభపెట్టి… ఇంకొందరిని భయపెట్టి… ఒత్తిళ్ళతో ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచే ప్రక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బీజేపీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చింది. మరికొంత ముందుగానే మాణిక్యం టాగోర్ గారు రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవి కావచ్చు. ఇప్పుడిక కాలము, ప్రజలే నిర్ణయించాలి,” అని విజయశాంతి ట్వీట్ చేశారు.

ఐతే, తాను కాంగ్రెస్ లోనే ఉంటాను అని ఆమె ఇప్పటికీ చెప్పట్లేదు. బీజేపీ వైపు అడుగులు పడడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

Related Stories