
‘బాహుబలి’, ‘భజరంగి భాయిజాన్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలు అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఒక విషయంలో క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కోసం ఆయన ‘దేవర’ అనే కథని రెడీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ అందులో నిజం లేదనేది ఆయన మాట.
పవన్ కళ్యాణ్ విజయేంద్రప్రసాద్ కి అభిమానం. రాజమౌళి తండ్రిగా కన్నా కథారచయితగా ఆయనకి కూడా మంచి స్టార్ డం వచ్చింది. అందుకే, ఆయన రాసే కథల కోసం డిమాండ్ పెరిగింది. తమిళంలో కూడా విజయ్ కి ‘అదిరింది’ వంటి కథలు ఇచ్చారాయన. రీసెంట్ గా నిర్మాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కోసం విజయేంద్ర ప్రసాద్ ని ఒక కథ అడిగారట. ఇప్పటికే ఆయన ‘దేవర’ అనే కాన్సెప్ట్ లో ఒక లైన్ చెప్పారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు.
కానీ ఆయన ఈ ప్రచారాన్ని కొట్టి పారేశారు. “ఇంతవరకు నేను పవన్ కళ్యాణ్ ని కలవలేదు. కథ చెప్పలేదు. ఆయనకి కథ రాయాలని అనుకున్న మాట మాత్రం వాస్తవం. కానీ నాకు ఎలాంటి పిలుపు రాలేదు,” అని ఆయన చెప్తున్నారు.