విరాటపర్వం – తెలుగు రివ్యూ

చాలా ఏళ్ల కిందట మణిరత్నం దర్శకత్వంల దిల్ సే అనే సినిమా వచ్చింది. అందులో హీరోయిన్ ఉగ్రవాది. హీరో ఆమె వెంట పడతాడు. ఈరోజు రిలీజైన విరాటపర్వంలో హీరో నక్సలైట్. హీరోయిన్ అతడి వెంట పడుతుంది. ఈ రెండు సినిమాల మధ్య ఇంతకుమించి అస్సలు పోలిక లేదు. ఇది వెన్నెల  సినిమా. ఆమె జీవితం ఈ విరాపటర్వం. వరంగల్ కు చెందిన సరళ అనే మహిళ జీవితంలో జరిగిన నక్సల్ ఘటనను నేపథ్యంగా తీసుకొని దర్శకుడు వేణు ఊడుగుల అళ్లుకున్న కథ ఇది. మరి ఈ వెన్నెల మెప్పించిందా?

పోలీసులకు, నక్సల్స్ కు భీకరంగా ఎన్ కౌంటర్ జరుగుతుంటే, మధ్యలో పుడుతుంది వెన్నెల (సాయిపల్లవి). ఓ మహిళా నక్సల్ చేతుల మీదుగా పురుడుపోసుకున్న వెన్నెల జీవితమంతా నక్సల్స్ చుట్టూనే తిరుగుతుంది. తండ్రి (సాయిచంద్) చెప్పిన ఒగ్గు కథలు వింటూ పెరిగిన వెన్నెల, కాలేజ్ రోజులకు వచ్చేసరికి అరణ్య కలం పేరిట రవన్న (రానా) రాసే విప్లవ సాహిత్యానికి ఆకర్షితురాలవుతుంది. రవన్నను చూడాలని కలలుకంటుంది. ఈ క్రమంలో తండ్రి చెప్పిన మీరాబాయి స్టోరీ విని, తను కూడా రవన్న కోసం అడవిలోకి వెళ్లిపోతుంది.

రవన్నను కలవడం కోసం వెన్నెల చేసిన ప్రయత్నాలు, ఆమె ఎదుర్కొన్న ఆటుపోట్లను అత్యంత సహజంగా చూపించాడు దర్శకుడు వేణు ఊడుగుల. ఈ క్రమంలో 90ల నాటి తెలంగాణ పల్లె వాతావరణం, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, అప్పటి మనుషుల ఆలోచన విధానాన్ని చక్కగా చూపించాడు. పనిలోపనిగా నక్సల్ ఉద్యమం ఎలా నీరుగారింది, నక్సలైట్లలో ఎలాంటి అభిప్రాయబేధాలొచ్చాయి, కోవర్టులు ఎలా పుట్టుకొచ్చారు, పోలీసులు నక్సల్స్ ను ఎలా నిర్వీర్యం చేశారనే విషయాల్ని కూడా అంతర్లీనంగా, అత్యంత సహజంగా దర్శకుడు చూపించాడు.

ఇలాంటి ఎన్నో అంశాల మధ్య ఉద్యమం పేరిట రవన్నకు దగ్గరైన వెన్నెల, తన మనసులో మాట చెబుతుంది. మరి రవన్న, వెన్నెల ప్రేమను అంగీకరించాడా? చివరికి రవన్న-వెన్నెల కథ ఏ మలుపు తిరిగిందనేది ఈ విరాటపర్వం.

ఈ సినిమాలో నక్సలిజం అనేది బ్యాక్ డ్రాప్ మాత్రమే. మెయిన్ స్టోరీ అంతా ప్రేమకథ కనిపిస్తుంది. అయితే వెన్నెల ప్రేమను ఎంత స్వచ్ఛంగా చూపించాడో, అప్పటి కాలంలో తెలంగాణలోని కల్లోలాన్ని కూడా దర్శకుడు వేణు అంతే నిజాయితీగా చూపించాడు. తెలంగాణలోని డీప్ ఫారెస్ట్ లో ఈ సినిమాను షూట్ చేసిన దర్శకుడు.. అప్పటికాలానికి సంబంధించిన ఏ చిన్న అంశాన్ని వదల్లేదు. ఇళ్లతో పాటు.. రాసుకునే పెన్ను వరకు ఎక్కడా డీటెయిలింగ్ మిస్సవ్వలేదు.

నక్సలిజాన్ని డీల్ చేస్తూ చాలా సినిమాలొచ్చాయి. డైరక్ట్ గా నక్సలిజంపైనే సినిమాలు కూడా వచ్చాయి. కానీ విరాటపర్వంలో నక్సలిజాన్ని మహిళల కోణంలో చూపించాడు దర్శకుడు. నక్సలైట్ గా మారిన కొడుకు కోసం ఎదురుచూసే తల్లి, నక్సల్ ఉద్యమంలో భర్త ప్రాణాలు కోల్పోతే, అతడి ఆశయాల్ని కొనసాగించే భార్య, నక్సల్ ఉద్యమం కోసం అర్థరాత్రిళ్లు పనిచేసే మహిళలు, ఇక ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్న మహిళా నక్సలైట్లు.. ఇలా చాలామంది మహిళలు కనిపిస్తారు. వాళ్లందరికీ కథలో సముచిత స్థానం దక్కింది. ఇప్పటివరకు వచ్చిన నక్సల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కు భిన్నంగా విరాటపర్వం కనిపించడానికి కారణం ఇదే.

ఓ సన్నివేశంలో నక్సలిజం వీడమని రానా తల్లి, అతడికి చెబుతుంది. తుపాకీ గొట్టంతో శాంతి రాదని, అమ్మాయి ప్రేమతో వస్తుందని చెబుతుంది. మరో సన్నివేశంలో సాయిపల్లవి పక్కనే ఆమె తండ్రి కూర్చొని, వెన్నెలను సమర్థిస్తూ మాట్లాడతాడు. ఆమెను అర్థం చేసుకున్నట్టు చెబుతాడు.  ఇక మరో సన్నివేశంలో రానా ఆవేశంగా మాట్లాడుతుంటాడు. ఇలాంటి చాలా సన్నివేశాల్లో దర్శకుడి కవితా స్పర్శ కనిపిస్తుంది. అతడి నిజాయితీ కనిపిస్తుంది. అలా ఈ కథను చెప్పడానికి కవిత్వాన్ని ఎక్కువగా నమ్ముకున్నాడు దర్శకుడు. అయితే ఈ పద్ధతి చాలామందికి నచ్చకపోవచ్చు. మెజారిటీ ప్రేక్షకులకు ఇది ఎక్కకపోవచ్చు.

ఫస్టాఫ్ లో డ్రాగ్ అనిపించే సన్నివేశాలు, క్లయిమాక్స్ లో ఎమోషన్ కాస్త తగ్గడం లాంటి చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ.. సాయిపల్లవి నటన, కథకు ఇచ్చిన ముగింపు హైలెట్స్ గా నిలుస్తాయి. ఈ కథకు కమర్షియల్ హంగులు అద్దాలని దర్శకుడూ ఎక్కడా ప్రయత్నించలేదు. నిజాయితీగా కథను చెప్పాలనుకున్నాడు. అందుకే అక్కడక్కడ కథ బోర్ కొడుతుంది. దీనికి తోడు రానా పాత్ర కూడా ఫ్లాట్ గా ఉంటుంది. ఆ పాత్ర ఆరంభం ఏమంత గొప్పగా అనిపించదు. ఎన్ కౌంటర్ సన్నివేశాలు కూడా ఏమంత మెప్పించవు.

వెన్నెలగా సాయిపల్లవి తన టాలెంట్ మొత్తం చూపించింది. ఆమె హావభావాలు హైలెట్. ప్రేమకు, ఆరాధనకు మధ్య తేడాను సాయిపల్లవి స్పష్టంగా చూపించగలిగింది. వెన్నెల తల్లిదండ్రులుగా ఈశ్వరీరావు, సాయిచంద్.. రవన్న అనుచరులుగా నవీన్ చంద్ర, ప్రియమణి, వెన్నెల బావగా రాహుల్ రామకృష్ణ, మానవ హక్కుల కార్యకర్తగా నందితా దాస్ తన పాత్రలకు న్యాయం చేశారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, సురేష్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

బాటమ్ లైన్
ఓవరాల్ గా విరాటపర్వం సినిమా 90ల్లో తెలంగాణ నక్సల్ ఉద్యమాన్ని, ఆ టైమ్ లో మహిళల కోణాన్ని ఆవిష్కరించింది. కథ పూర్తిస్థాయిలో మెప్పించకపోయినప్పటికీ.. సినిమాలో మిడిల్ పోర్షన్ ఆకట్టుకునే విధంగా లేనప్పటికీ.. దర్శకుడు వేణు ఊడుగుల నిజాయితీగా తీసిన సినిమా ఇది. కమర్షియల్ హంగులకు దూరంగా తీసిన ఈ సినిమాను సాయిపల్లవి పెర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు.

Rating: 2.75/5

By: పంచ్ పట్నాయక్

 

More

Related Stories