
యువ హీరో విశ్వక్ సేన్ కి ఆవేశం ఎక్కువ. ప్రతి సినిమా విడుదల టైంలో ఎదో ఒక కామెంట్ చేస్తాడు. ఆవేశంలో ఏదేదో మాట్లాడుతాడు. మొదట్లో ఆయన దూకుడు యువతకి నచ్చింది. కానీ ఇప్పుడు అది వర్కవుట్ కావట్లేదు. ఇటీవల తన సినిమా విడుదల తేదీని మార్చేస్తే ఆ సినిమాని ప్రమోట్ చెయ్యను అని నిర్మాతలకు అల్టిమేటం ఇచ్చాడు. అయినా, డేట్ ని మార్చారు నిర్మాతలు.
విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని డిసెంబర్ 8న విడుదల చేస్తామని ప్రకటించారు నిర్మాతలు. కానీ, నాని నటించిన “హాయ్ నాన్న”, నితిన్ నటించిన “ఎక్స్ట్రా” సినిమాలు డిసెంబర్ 7/8 డేట్స్ ఫిక్స్ చేసుకోవడంతో తమ సినిమా డేట్ ని మార్చేద్దామని నిర్మాత నాగవంశీ అనుకున్నారు.
నిర్మాత ఆ ఆలోచనలో ఉండగానే, హడావిడిగా విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. నిర్మాత ఒకవేళ డేట్ మార్చితే నేను “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటాను అని ప్రకటించాడు.
ఇప్పుడు నిర్మాతలు ఈ సినిమాని ఏకంగా మార్చి 8, 2024కి మార్చేశారు. డిసెంబర్ 8న విడుదల కావాల్సిన సినిమా మూడు నెలల తర్వాత విడుదల కానుంది. నిర్మాతలు నచ్చ చెప్పిన తర్వాతే హీరో తగ్గాడు అని సమాచారం.
‘Gangs of Godavari’ gets postponed to March 2024
విడుదల తేదీల విషయంలో ఆవేశం పనికి రాదు అని “మంచి డేట్”కి రావడం ముఖ్యం అని అతనికి అర్థమయ్యేలా చెప్పారట. దాంతో హీరోగారు ఆవేశాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది.