
కీర్తి సురేష్ పెళ్లి గురించి చాలా కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు కీర్తి సురేష్ వాటిని తోసిపుచ్చింది. తాజాగా ఆమె తండ్రి సురేష్ కుమార్ స్పందించారు.
“దయచేసి నా కూతురు పెళ్లి గురించి అబద్దాలు ప్రచారం చేయకండి అంటూ మీడియాని అభ్యర్థించారు. “మా అమ్మాయి పెద్ద హీరోయిన్. సెలెబ్రిటీల గురించి ఇలాంటి ప్రచారాలు జరుగుతాయి అని మాకు తెలుసు. కానీ అసత్యాలు ప్రచారం చేస్తే అందరికీ ఇబ్బందే,” అని ఆయన అన్నారు.
“కీర్తి సురేశ్ కి పెళ్లి కుదిరితే ఆ విషయాన్ని దాచిపెట్టం. అది అందరితో అనందంగా పంచుకునే విషయమే కదా. సీక్రెట్ గా పెళ్లి చేసే వాళ్ళం కాదు. కాబట్టి ఇలాంటి విషయాలపై నిరాధార వార్తలు రాయొద్దు. ఇవి సున్నితమైన విషయాలు. మీడియా దయచేసి అర్థం చేసుకోవాలి,” అని సురేష్ కుమార్ కోరారు.
30 ఏళ్ల కీర్తి సురేష్ ప్రస్తుతం ‘భోళా శంకర్’ చిత్రంలో నటిస్తోంది. “ప్రస్తుతం తెలుగులో నేను చేస్తున్న చిత్రమిదే. కొత్తగా ఇంకా ఏది సైన్ చెయ్యలేదు,” అని కీర్తి తాజాగా తిరుపతిలో మీడియాకి చెప్పింది.