
హీరోయిన్ శ్రీలీల 2023 బ్యాడ్ గా ముగిసింది. చాలా సినిమాలు విడుదల అయ్యాయి కానీ ఆమెకి కళ్ళు చెదిరే హిట్ మాత్రం దక్కలేదు. “భగవంత్ కేసరి” మాత్రం ఫర్వాలేదు అనే రీతిలో ఫలితాన్ని అందించింది. ఇక 12 రోజుల్లో “గుంటూరు కారం” విడుదల అవుతుంది. 2024లో విడుదల అవుతున్న మొదటి సినిమా ఇదే ఆమెకి.
ఐతే, “గుంటూరు కారం” విడుదలైన తర్వాత ఆమెకి చాలా గ్యాప్ రానుంది. ఎందుకంటే ఆమె కొత్తగా సినిమాలు ఏవీ ఒప్పుకోలేదు.
“ఉస్తాద్ భగత్ సింగ్”, “విజయ్ దేవరకొండ 12” చిత్రాలు 2024లో విడుదల అవుతాయి అనే ఉద్దేశంతో వాటిని సైన్ చేసింది. ఐతే, “ఉస్తాద్ భగత్ సింగ్” ఆగిపోయింది. విజయ్ దేవరకొండ – దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చిత్రం షూటింగ్ కూడా వాయిదా పడింది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం. అలా రెండు సినిమాలు ఆగిపోవడంతో ఆమెకి 2024లో సినిమాల సంఖ్య తగ్గుతోంది.
“గుంటూరు కారం” విడుదలైన తర్వాత ఆమె మళ్ళీ కొత్త సినిమాలు ఒప్పుకోవాలి. ఐతే, పెద్ద సినిమాల ఆఫర్లు వస్తాయా అన్నది చూడాలి. మహేష్ బాబు సరసన నటించిన “గుంటూరు కారం” పెద్ద హిట్ అయితే ఆమెకి మళ్ళీ పెద్ద సినిమాల ఆఫర్లు క్యూ కడుతాయి.