రాజమౌళి మౌనం వీడేదెప్పుడు?

- Advertisement -
Rajamouli


ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం “ఆర్ ఆర్ ఆర్” అక్టోబర్ 13న విడుదల కావడం లేదు. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. లేటెస్ట్ గా ఉగాది 2022కి విడుదల కానుంది అనేది టాక్.

ఐతే, రాజమౌళి మాత్రం కొత్త డేట్ చెప్పడం లేదు. అక్టోబర్ 13 నుంచి సినిమాని వాయిదా వేశామని కూడా ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ఆయన చెప్పకపోయినా ఇండస్ట్రీలో అందరికి తెలుసు కాబట్టే… అక్టోబర్ 8, 13 తేదీలకు పలు చిన్న సినిమాలు డేట్ ని ఖరారు చేసుకుంటున్నాయి.

“ఆర్ ఆర్ ఆర్” మొదట అనుకున్న విడుదల తేదీ… జులై 30, 2020. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఆ తర్వాత జనవరి 8, 2021గా మార్పు జరిగింది. కరోనా మొదటి వేవ్, లాక్డౌన్ ల కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది. దాంతో, మరోసారి విడుదల తేదీని మార్చకతప్పలేదు. కొత్త డేట్.. అక్టోబర్ 13, 2021 అని గ్రాండ్ గా అనౌన్స్ చేసింది టీం. కానీ ఈ డేట్ కి కూడా రాజమౌళి “ఆర్ ఆర్ ఆర్”ని రిలీజ్ చెయ్యలేరు అని ఇండస్ట్రీలో రెండు, మూడు నెలలుగా అందరూ డిస్కస్ చేసుకుంటూనే ఉన్నారు. అయినా, రాజమౌళి మాత్రం ఆ డేట్ వచ్ఛేయ్యాలన్నట్లుగా ప్రొమోషన్ హంగామా చెయ్యడం ఆశ్చర్యం కలిగించింది.

“దోస్తీ” అనే మొదటి పాట బయటికి వదలడం.. రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి అయిందని ప్రకటన ఇవ్వడంతో రాజమౌళి దసరా విడుదల తేదీపై గట్టిగా నిలబడ్డారనిపించింది. అక్టోబర్ 13కి ఆ సినిమా రాలేదు అని ట్రేడ్ పండితులకు తెలిసినా రాజమౌళి పట్టుదల చూసి వారు కూడా అభిప్రాయం మార్చుకున్నారు. నెల తిరిగే సరికి శీను మారింది. ‘దోస్తీ’ పాటని జనం మర్చిపోయారు. రాజమౌళి కూడా సినిమా డేట్ ని 2022కి మార్చేందుకు అంగీకరించారు.

కేవలం ఆయన ఈ విషయంలో మౌనం వీడి అధికారికంగా ప్రకటించాల్సి మాత్రమే ఉంది. దానికి ముహూర్తం ఎపుడు అనేది చూడాలి.

 

More

Related Stories