తప్పు ఎవరిది? పూరిదా? విజయ్ దా?

Liger Trailer Launch

“లైగర్” దారుణంగా పరాజయం పాలైంది. ఆగస్టు 25న దేశం షేక్ అవుతుంది అని విజయ్ దేవరకొండ ప్రమోషన్ లలో ఊదరగొట్టారు. దేశం షేక్ కాలేదు. విజయ్, పూరి, ఆ సినిమా కొన్న బయ్యర్లు షేక్ అయ్యారు ఫలితం చూసి.

విజయ్ దేవరకొండ అంత కాన్ఫిడెంట్ గా (కొందరు ఓవర్ కాన్ఫిడెన్స్ అని కూడా అంటున్నారు) ఎలా ప్రమోట్ చేశాడు? సినిమా చూసే “దేశం షేక్ అవుతుంది” అన్నాడా? ఇంతకీ ఈ సినిమా విషయంలో తప్పు ఎవరిది? ఇస్మార్ట్ శంకర్ ఫలితం చూసి గుడ్డిగా నమ్మేసిన దేవరకొండదా లేక ఎప్పుడో ఫామ్ కోల్పోయినా పూరిదా?

వరుసగా మూడు ఫ్లాప్ లు రావడంతో విజయ్ దేవరకొండ చాలా అయోమయంలో పడ్డాడు. అదే సమయంలో పూరి నుంచి ఆఫర్ రావడంతో వెంటనే ఒప్పుకున్నాడు. పైగా, రామ్ తో పూరి ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సెన్సేషనల్ హిట్ ఇచ్చాడు. దాంతో, విజయ్ పూరిని గుడ్డిగా నమ్మి ఫాలో అయ్యారు. ఆయన చెప్పిన రెండు కథల్లో “లైగర్” కథని ఒకే చేసి… తన బాడీని మార్చుకున్నాడు. రెండేళ్లు సినిమాకే తన అంకితం ఇచ్చాడు. ఈ విషయంలో విజయ్ దేవరకొండని తప్పు పట్టలేం.

ఐతే, షూటింగ్ పూర్తి అయిన 8 నెలల తర్వాత “లైగర్” విడుదలైంది. మరి ఈ ఎనిమిది నెలల్లో విజయ్ దేవరకొండ సినిమాని చూడలేదా? చూసి కూడా జడ్జ్ చెయ్యలేకపోయాడు. అలాంటి కంగాళీ చిత్రం చూసి… దేశం షేక్ అయిపోతుంది… 200 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఎలా భారీ స్టేట్మెంట్ లు ఇచ్చాడు?

విజయ్ నటన, అతని కమిట్ మెంట్, అతని సిన్సియారిటిని మెచ్చుకోవాల్సిందే. కానీ, స్క్రిప్ట్ సెలెక్షన్, జడ్జిమెంట్ రాకపోతే ఎలా? పూరికి పెద్దగా వచ్చే నష్టం ఏమి లేదు. ఆయన ఇప్పటికే ఎన్నో డిజాస్టర్లు ఇచ్చారు. మళ్ళీ బ్యాక్ వచ్చారు. కానీ, హీరోగా విజయ్ దేవరకొండ ఇకపై చెప్పే స్టేట్మెంట్లు జనం కానీ, ఆయన అభిమానులు కానీ నమ్ముతారా?

ఇక పూరి జగన్నాధ్ కూడా ఇంత పెద్ద పాన్ ఇండియా చిత్రం ప్లాన్ చేసినప్పుడు కథ, కథనాల విషయంలో చాలా పకడ్బందీగా ఉండాలి కదా. ఒకప్పుడు ‘పోకిరి’ వంటి చిత్రాలు తీసిన పూరి ఇప్పుడు మళ్ళీ భారీ చిత్రాలు ప్లాన్ చేయాలనుకుంటున్నప్పుడు సెన్సేషనల్ సినిమా కాకపోయినా యావరేజ్ గా అయినా తీయాలి కదా. హీరోయిన్ ని హీరో తల్లి తిట్టగానే వోడ్కా బాటిల్ అందుకోవడం, ఆ వెంటనే డ్రీం సాంగ్ వేసుకోవడం, డ్రీంలో ఆమె వేసిన డ్యాన్స్ స్టెప్ రాత్రి రాత్రికే ఇన్ స్టాగ్రామ్ లో వెళ్లడం, దాన్ని జనం వైరల్ చెయ్యడంలాంటి సన్నివేశాలు పూరిలాంటి సీనియర్ రైటర్, డైరెక్టర్ రాయొచ్చా?

అసలు సినిమాలో ఎవరు విలనో కూడా చెప్పకుండా సినిమా క్లైమాక్స్ ని అలా చెయ్యొచ్చా?

 

More

Related Stories