
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పన్నమైన సినిమా రంగంలోని సమస్య వల్ల ఎవరు ప్రధానంగా నష్టపోతారు? దీని వల్ల ఏ విభాగాలు రోడ్డు మీద పడే అవకాశం ఉంది?… అనే విషయాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికీ… టాలీవుడ్ వర్గాలకీ అవగాహన లేదు అనుకొంటే అమాయకత్వమే. టికెట్ ధరల తగ్గింపు, ఆన్లైన్ టికెట్ విక్రయాల లాంటి వాటి మూలంగా ప్రభావితమయ్యే విభాగాలు మినహా – ఈ సమస్యతో నేరుగా ఎలాంటి ఇబ్బంది లేని వాళ్ళు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సమావేశం కావడం అత్యంత విచిత్రం.
ప్రభాస్, మహేశ్ బాబు, కొరటాల శివ, అలీ, పోసానిలాంటివాళ్లకు అన్ని సమస్యలపై సాధికారిత ఉంటుంది అనుకోలేం. నిజానికి ఇలాంటి మీటింగ్ లో నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు, సీనియర్ నిర్మాతలు దిల్ రాజ్, సురేష్ బాబు, ఆసియన్ సునీల్ వంటి వారు వెళితే బాగుంటుంది. ఇంకా నిర్మాతగా నిలదొక్కుకుని నిరంజన్ రెడ్డికి అక్కడికి వెళ్లేందుకు ఉన్న అర్హత ఏంటి?
థియేటర్ క్లాసిఫికేషన్ ఏమిటి? ఎలా చేస్తారు? టికెట్ ధర నిర్ణయం ఎలా ఉంటుంది? ఒక సినిమా హాలుకు ఎన్ని రకాల పన్నులు ఉంటాయి? అసలు సినిమా హాలు కట్టాలి అంటే ఎన్ని రకాల అనుమతులు అవసరం? లాంటి ప్రాథమిక విషయాలు నవరత్నాలు లాంటి ఆ స్టార్స్ కు తెలుసా? నిజానికి అక్కడికి వెళ్ళిన బృందానికి ఆ విషయాలు తెలియాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రికి సంబంధించిన వ్యాపారం అనే ఎండ్ లో వాళ్ళు ఉండరు. వాళ్ళు క్రియేటివ్ వింగ్ కి సంబంధించినవాళ్లు. వాళ్ళతో మాట్లాడి సినిమా వ్యాపారం అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలను ప్రభుత్వం ఏ విధంగా వెల్లడిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల నేరుగా నష్టపోయేది సినిమా థియేటర్ నిర్వాహకులు/యజమానులు, పంపిణీదారులు, నిర్మాతలు. టికెట్ ధరలు తగ్గించేయడం, విద్యుత్ సంబంధిత రాయితీలు లేకుండానే.. అధిక ఛార్జీలు విధింపు, రెవెన్యూ దాడులు లాంటి అంశాలను ఎగ్జిబిటర్లు ప్రధానంగా లేవనెత్తుతున్నారు. వీటిని సరిదిద్దకపోతే థియేటర్లు మూసేస్తామని చెప్పి డిసెంబర్ నెలలో మూసేశారు. థియేటర్లు లేకపోతే వ్యాపారం దెబ్బ తింటుందని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఆందోళన చెందారు. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించి ఉంటే ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం కావాలి. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వమే కాదు టాలీవుడ్ కూడా వాస్తవాన్ని విస్మరించినట్లుగా ఉంది.
ముఖ్యమంత్రితో సమావేశానికి ఛాంబర్ ప్రతినిధులను పంపించాలిగానీ స్టార్ హీరోలు, దర్శకులను పంపడం వల్ల ప్రయోజనం ఉండదు అని ఎందుకు టాలీవుడ్ పెద్దలు గ్రహించలేదు. లేకపోతే ప్రభుత్వమే ఫలానా వాళ్ళు మాత్రమే రావాలి అని చెప్పిందా? ముఖ్యమంత్రి నన్ను ఆహ్వానించారు అని చిరంజీవి చెప్పారు. ఈ మాటతోనే పలు సందేహాలు ఉత్పన్నం అవుతున్నాయి. అంటే ప్రభుత్వం సెలెక్టివ్ గానే స్టార్స్ ను పిలిపించుకొన్నది అని అర్థం చేసుకోవాలా? స్టార్స్ వస్తే సమస్య పరిష్కారం అవుతుంది… ప్రభావిత వర్గాలతో పని లేదు అని సందేశం ఇస్తుందా? ప్రభుత్వం తీరు ఎలా ఉంది అంటే – రోగంతో బాధపడుతున్న రోగితో మాట్లాడాల్సిన పని లేదు… సంబంధించిన వాళ్ళు ఎవరొకరు వస్తే వాళ్ళు చెప్పినదాని ప్రకారం ప్రిస్కిప్షన్ రాస్తాం అన్నట్లు ఉంది. వెళ్ళిన వాళ్ళు కూడా ఏదొక ప్రిస్కిప్షన్ రాసి మందులు ఇస్తే వాడేద్దాం అన్నట్లు ఉంది. అసలు రోగానికి మందు ఎప్పుడుపడుతుందో ఆ పెరుమాళ్ళుకే తెలియాలి.
ఐతే, పెద్ద స్టార్స్ వెళితే ఇండస్ట్రీ అంతా వచ్చినట్లుగా భావిస్తారు అని అనుకున్నారట.