
తెలుగు సినిమాలకు సంబంధించి ఏఆర్ రెహ్మాన్ పేరు పెద్దగా తెరపైకి రాదు. కుదిరితే తమన్, కుదరకపోతే దేవిశ్రీప్రసాద్… పెద్ద సినిమాలకు వీళ్లే వర్క్ చేస్తుంటారు. కానీ ఈసారి మాత్రం ఊహించని విధంగా రెహ్మాన్ పేరు తెరపైకొచ్చింది. అది కూడా 2 పెద్ద సినిమాలకు సంబంధించి ఈ లెజెండ్ మ్యూజిక్ డైరక్టర్ పేరు తెరపైకొచ్చింది.
ఎన్టీఆర్, బుచ్చిబాబు కాంబోలో ఓ సినిమా లాక్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఆ సినిమా కోసం సంగీత దర్శకుడిగా రెహ్మాన్ ను అనుకుంటున్నారట. అదే సమయంలో పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ సినిమాకు సంబంధించి కూడా రెహ్మాన్ పేరు ప్రస్తావనకొచ్చింది.
ప్రస్తుతం విజయ్-పూరి లైగర్ సినిమా చేస్తున్నారు. అది రిలీజ్ అవ్వకముందే ఇద్దరి కాంబోలో మరో సినిమా ఎనౌన్స్ అయ్యేలా ఉంది. “జనగణమన” ప్రాజెక్టును విజయ్ తో టేకప్ చేయాలని పూరి భావిస్తున్నాడట. సినిమా కూడా ఎనౌన్స్ కాకముందే, ఈ సినిమాకు సంబంధించి రెహ్మాన్ పేరు ప్రముఖంగా వినిపించడం విశేషం.
ఇలా టాలీవుడ్ కు సంబంధించి ఒకేసారి రెండు పెద్ద సినిమాలకు రెహ్మాన్ పేరు చర్చకు రావడం విశేషం. గతంలో చిరంజీవి నటించిన సైరా సినిమా కోసం రెహ్మాన్ ను అనుకున్నారు. తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి అతడు తప్పుకున్నాడు. మళ్లీ ఇన్నేళ్లకు టాలీవుడ్ లో రెహ్మాన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈసారి ఏమౌతుందో చూడాలి.