క్షమించండి అంటూ విల్ స్మిత్ లేఖ

- Advertisement -

ఆస్కార్ అవార్డుల చరిత్రలో 2022 ఆస్కార్ అవార్డుల కార్యక్రమం మర్చిపోలేని పేజీ. స్టేజ్ మీద యాంకర్ ని ఒక పెద్ద హీరో కొట్టడం అందర్నీ షాక్ కి గురి చేసింది. నటుడు విల్ స్మిత్… ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న క్రిస్ రాక్ ముఖం మీద బలంగా గుద్ది… వెంటనే స్టేజ్ దిగిపోయారు విల్ స్మిత్. ఆ తర్వాత విల్ స్మిత్ తనకి ప్రకటించిన ఉత్తమ నటుడు అవార్డ్ ని అందుకున్నారు.

క్షణాల్లో జరిగిన ఈ ఘటన బాగా వైరల్ అయింది. ఐతే, విల్ స్మిత్ పై ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో ఆస్కార్ అవార్డుల టీంపై విమర్శలు వెల్లువెత్తాయి.

యాంకర్ క్రిస్ రాక్ … విల్ స్మిత్ భార్య గుండుపై (ఆమెకి ఒక వ్యాధి కారణంగా గుండు చేయించుకున్నారు) క్రిస్ రాక్ జోక్ వేశారు. అంతే, విల్ స్మిత్ తన సీట్ నుంచి లేచి స్టేజ్ మీదకి వెళ్లి గట్టిగా గుద్ది కలకలం రేపారు. “నా భార్యని ఏమైనా అంటే ఊరుకోను,” అని హెచ్చరించారు విల్ స్మిత్.

ఐతే, ఈ అవార్డుల కార్యక్రమం ముగిసిన ఒక రోజు తర్వాత తన సోషల్ మీడియా వేదికపై క్షమాపణ లేఖ పోస్ట్ చేశారు విల్ స్మిత్. “అలా చెయ్యడం తప్పు. కారణమేదైనా ఒకరిని కొట్టడం సమర్ధించుకోలేం. నేను తప్పు చేశాను. క్రిస్ రాక్ కి క్షమాపణలు. ఆస్కార్ అకాడెమీ కూడా నన్ను క్షమించాలి. ఆవేశంలో అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది,” అంటూ చెప్పుకొచ్చారు.

హాలీవుడ్ లో పెద్ద హీరోలలో ఒకరైన విల్ స్మిత్ కి ఉత్తమ నటుడిగా ఈ ఏడాది ఆస్కార్ దక్కింది. టెన్నిస్ క్రీడాకారిణులు సెరెనా, వీనస్ విలియమ్స్ ని వాళ్ళ తండ్రి ఎలా తీర్చిదిద్దాడు, ఎలా వారిని ఛాంపియన్స్ గా మలిచాడనే కథతో రూపొందిన ‘కింగ్ రిచర్డ్’ సినిమాలో విల్ స్మిత్ నటించాడు. విలియమ్స్ సిస్టర్స్ తండ్రి రిచర్డ్ గా అద్భుతంగా నటించి మొదటి సారి ఆస్కార్ అందుకున్నారు.

 

More

Related Stories