
“కెజిఎఫ్” సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయారు కన్నడ సూపర్ స్టార్ యష్. ఆయన తదుపరి చిత్రం ఎవరితో ఉంటుంది అనే విషయంలోనే గత ఏడాది కాలంగా రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. “కెజిఎఫ్2” విడుదలయి ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. కానీ, తన నెక్స్ట్ సినిమా గురించి ఇంకా ప్రకటన చెయ్యలేదు యష్.
ఆయన కూడా చాలా అయోమయంలో ఉన్నట్లు టాక్. ఐతే, చివరికి ఒక లేడి డైరెక్టర్ చెప్పిన కథకి అంగీకారం తెలిపినట్లు మలయాళ, కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఆ లేడి డైరెక్టర్ ఎవరో కాదు…గీతూ మోహన్ దాస్. ఒకప్పుడు హీరోయిన్ గా పలు మలయాళ సినిమాల్లో నటించిన గీతూ ఆ తర్వాత దర్శకురాలిగా మారారు. ఆమె భర్త రాజీవ్ రాయ్ ఫేమస్ కెమెరామెన్. అలాగే దర్శకుడు కూడా. ఆమె డైరెక్టర్ గా ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. ఇప్పటికే రెండు సినిమాలు తీశారు. తన మూడో చిత్రంగా యష్ ని హీరోగా అనుకొని అతన్ని సంప్రదించడం, ఆమె చెప్పిన కథ నచ్చడంతో ఆమెకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఐతే, గీతూ మోహన్ దాస్ తీసిన ఆ రెండు సినిమాలు మోస్తరు విజయాలు మాత్రమే సాధించాయి. అవి పాన్ ఇండియా చిత్రాలు కావు. మరి ఇప్ప్పుడు యష్ కున్న ఇమేజ్ దృష్ట్యా ఆయన శంకర్, రాజమౌళి రేంజ్ డైరెక్టర్స్ తో పనిచేస్తాడని అందరూ భావిస్తున్న తరుణంలో గీతూకి ఎలా ఓకే చెప్పారు అనేది అందర్నీ ఆశ్చర్యపరుస్తోన్న విషయం.
మరి ఈ వార్తల్లో నిజం ఉందా? లేకపోతే ఇంతకుముందు జరిగిన అనేక కాంబినేషన్ ల మాదిరే ఇది కూడా ఐడియా దగ్గరే ఆగిపోతుందా?