
సీఎం సీఎం… !
ఇది జనరల్ గా పవన్ కళ్యాణ్ ముందు వినిపించే మాట. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూసుకోవాలి అని ఎప్పటి నుంచో ముచ్చట పడుతున్నారు. కానీ ఆ అవకాశం 2024లో కూడా వచ్చేది లేదు.
పవన్ కళ్యాణ్ కి చెందిన జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యనున్నాయి. ఈ కూటమి అధికారంలోకి వస్తే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అని ఇటీవల నారా లోకేష్ ప్రకటించారు. రెండున్నర ఏళ్ల తర్వాత ఆ సీటుని పవన్ కళ్యాణ్ కి అప్పచెప్పే ఆలోచన ఏమి లేదని అన్నట్లుగా లోకేష్ మాట్లాడారట. ఈ విషయాన్ని వైఎస్సార్సి పార్టీ బాగా వైరల్ చేస్తోంది.
పవన్ కళ్యాణ్ ఇప్పట్లో సీఎం కాలేడు అన్న ప్రచారాన్ని ఎక్కువ చేస్తే పవర్ స్టార్ అభిమానులు నిరుత్సహపడుతారు అనే ఉద్దేశంతో వైఎస్సార్ పార్టీ ఈ మాటను వైరల్ చేస్తోంది.
పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూసుకోవాలనేది ఆయన అభిమానుల కోరిక. ఆ అవకాశం లేదంటే అభిమానులకు ఓటెయ్యాలనే కోరిక పెద్దగా కలగదు. అందుకే వైఎస్సార్ పార్టీ దీన్ని ఎక్కువగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.
మరోవైపు, పవన్ కళ్యాణ్ తన సినిమాల కమిట్ మెంట్స్ అన్ని ఆపేసి వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టారు. తెలుగుదేశం – జనసేన కూటమిని అధికారంలోకి తెచ్చేంతవరకు విశ్రమించను అని పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్తున్నారు.