
మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటిస్తున్నారు. “వారణాసి” సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తి అయింది. జూన్, జులై నాటికి మొత్తం షూటింగ్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్ పనులు, గ్రాఫిక్స్ పనులు, ప్రమోషన్స్ పై దృష్టి పెడుతారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది.
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ చివరి వరకు పూర్తిగా ప్రమోషన్లు, ఈవెంట్లపై ఫోకస్ పెట్టాలి. ఐతే, నిజంగా రాజమౌళి ప్లాన్ చేసినట్లు జూలైలోపు షూటింగ్ పూర్తి అయితే మహేష్ బాబు మరో సినిమాని పక్కాగా ప్లాన్ చేసుకొని షూటింగ్ మొదలుపెట్టొచ్చు. అందుకే, మహేష్ బాబు తన తదుపరి చిత్రాల గురించి ఆలోచిస్తున్నారట.
ఐతే, మహేష్ బాబు ఇప్పటివరకు ఏ సినిమాని సైన్ చెయ్యలేదు. కానీ ఒక అరడజన్ నిర్మాణ సంస్థలు మహేష్ బాబుతో సినిమా చేసేందుకు పోటీ పడుతున్నాయిని, ఫలానా దర్శకుడి సినిమా ఒకే అయింది అని కొన్ని మీడియా సంస్థలు వార్తలు వండేస్తున్నాయి.
నిజమేమిటంటే మహేష్ బాబు తదుపరి చిత్రం ఏంటి అనేది అస్సలు చర్చకే రాలేదు. ఏ పెద్ద హీరోకైనా బడా నిర్మాణ సంస్థలు ఎప్పుడూ రెడీగా ఉంటాయి. మహేష్ బాబులాంటి హీరో సినిమా చేస్తానంటే అర డజన్ ఏంటి డజన్ నిర్మాణ సంస్థలు క్యూ కడుతాయి. కానీ 200 కోట్ల రూపాయల సినిమానే లేని టైంలోనే మహేష్ బాబు 70 కోట్లు పైనే పార్టీతోషికం తీసుకున్నారు. ఇప్పుడు రాజమౌళి సినిమా భారీ హిట్ అయ్యి అది వెయ్యి, రెండు వేల కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తే మహేష్ బాబు అడిగే లెక్కలు, తీసుకునే అమౌంట్ వేరుగా ఉంటుంది.
