
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ తర్వాత ఎటువంటి బులెటిన్ విడుదల చెయ్యలేదు. కానీ బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి (Nara Brahmani) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సమాచారం వెల్లడించారు.
హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో బాలకృష్ణకు మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని, ఇప్పటికే కోలుకుంటున్నారని, ఎప్పటిలాగే ఉత్సాహంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. త్వరలోనే ఆయన అభిమానుల ముందుకు తిరిగి వస్తారని వెల్లడించారు.
“సర్జరీ పూర్తిగా విజయవంతంగా ముగిసింది. ఇప్పటికే ఆయన మునుపటి ఉత్సహం, ఎనర్జీతో ఉన్నారు. త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటారు,” అని ఆమె రాశారు.
కాకినాడలో ‘NBK111’కి సంబంధించి షూటింగ్‌లో బాలకృష్ణ ఎడమ మోకాలికి గాయమైంది. తొలుత స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. మోకాలి శస్త్రచికిత్స మూడు గంటలకు పైగా విజయవంతంగా సాగింది.
శస్త్రచికిత్స ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తికావడం, అలాగే బ్రాహ్మణి ఇచ్చిన తాజా అప్‌డేట్‌తో అభిమానులు ఊరట చెందుతున్నారు.
