
గత కొన్ని వారాలుగా సమంత (Samantha) గర్భవతి అనే వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ వార్తలపై స్వయంగా సమంత స్పందించారు. అధికారికంగా ధృవీకరించారు.
బుధవారం హైదరాబాద్‌లో జరిగిన “మా ఇంటి బంగారం” (Maa Inti Bangaaram) సక్సెస్ మీట్‌లో మాట్లాడిన సమంత, త్వరలో మరోసారి విరామం తీసుకోనున్నట్లు వెల్లడించారు.
“ఈ సినిమాకి ముందు మూడేళ్లు గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్లీ ఒక చిన్న గ్యాప్ తీసుకోబోతున్నాను,” అని ఆమె తెలిపారు. మెటర్నిటీ గ్యాప్ అంటూ నవ్వేశారు.
మాతృత్వం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన అధ్యాయమని పేర్కొన్న సమంత, ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించిన తర్వాతే మళ్లీ కెరీర్‌పై దృష్టి పెడతానని చెప్పారు. ఈ విరామం శాశ్వతం కాదని, కొంతకాలం తర్వాత కొత్త ప్రాజెక్ట్‌లతో తిరిగి వస్తానని హామీ ఇచ్చారు.
ఇటీవల “మా ఇంటి బంగారం” చిత్రంతో విజయవంతమైన కంబ్యాక్ చేసిన సమంత, ఇప్పుడు జీవితంలో మరో కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నారు.
