
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్ హీరోయిన్. ఏకంగా ఓ టీవీ ఛానెల్ పై నటి సుకన్య పరువు నష్టం దావా వేసింది. ఆ కేసు 30 ఏళ్లు సాగింది. అంతిమంగా ఆమె విజయం సాధించింది. పరువు నష్టం కింద సుకన్యకు 10 లక్షల 500 రూపాయలు చెల్లించాలంటూ కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పుడా కేసు వివరాల్లోకి వెళ్దాం..
1996లో వీరప్పన్ ఇంటర్వ్యూ ప్రసారం చేసింది సన్ టీవీ. ఆ ఇంటర్వ్యూలో తన పేరుప్రతిష్టలకు భంగం కలిగేలా కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆమె సన్ టీవీపై చెన్నై సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
నష్ట పరిహారం చెల్లించాలంటూ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టును ఆశ్రయించింది సన్ టీవీ. సుదీర్ఘంగా సాగిన ఈ విచారణ ఈనెల 5తో ముగిసింది. సిటీ సివిల్ కోర్టు తీర్పును మద్రాసు హైకోర్టు సమర్థించింది.
వీరప్పన్ ఇంటర్వ్యూను ఎడిట్ చేసే వెసులుబాటు, అధికారం ఉన్నప్పటికీ సదరు ఛానెల్ ఆ పని చేయలేదని, కాబట్టి నటి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించడం నిజమేనని కోర్టు తేల్చింది. సిటీ సివిల్ కోర్టు విధించిన 10 లక్షల 500 రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. అలా సుదీర్ఘ విచారణ తర్వాత సుకన్య పరువును కాపాడింది కోర్టు.
