పవన్ కళ్యాణ్ నటించిన “బ్రో” సినిమా గురించి ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు మూడు సార్లు ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేశారు. సినిమా పోయింది అని, కలెక్షన్లు లేవని ఒకసారి, తనని పోలిన ఒక పాత్ర సినిమాలో పెట్టారని మరోసారి ప్రెస్ మీట్ పెట్టారు అంబటి రాంబాబు. అవకాశం దొరికినప్పుడల్లా “బ్రో” గురించి మాట్లాడి పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించాను అని ఆయన భావించినట్లు ఉన్నారు.
కానీ, అది రివర్స్ అయింది. “బ్రో” సినిమా ఫలితం పక్కన పెడితే ఒక సినిమా గురించి మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం వల్ల జనంలోకి సందేశం వేరే విధంగా వెళ్ళింది. పవన్ కళ్యాణ్ కి ప్రభుత్వం భయపడుతోంది అన్నట్లుగా జనం భావిస్తున్నారు ఇప్పుడు.
“బ్రో” సినిమాలో “శ్యామ్ బాబు” అనే పాత్ర ఉన్న మాట నిజమే. ఆ పాత్రని కమెడియన్ పృథ్వి పోషించారు. కానీ, ఆ పాత్ర అంబటి రాంబాబుకి స్పూఫ్ అని చాలామంది గ్రహించలేదు. చాలా చిన్న పాత్ర అది. దానికే అంబటి గింజుకోవడం అంటే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ విమర్శలకు, సెటైర్లకు గింగిరాలు తిరుగుతోంది అన్నట్లుగా జనం అర్థం చేసుకుంటున్నారు.
అందుకే, పవన్ కళ్యాణ్ కి “బ్రో” సినిమా ఫలితం నిరాశపర్చలేదు. పైగా అంబటి ఇష్యు వల్ల బెనిఫిట్ అయింది. ఆ సినిమా ఫ్లాప్ అయిందా, హిట్ అయ్యిందా అని ఎవరూ అడగడం లేదు. “బ్రో”లో అంబటి రాంబాబు గురించి ఏమి తీశారు అని ఆరా తీయడం మొదలైంది. అలా మంత్రి అంబటి తానే కోరి ట్రోలింగ్ తెచ్చుకున్నట్లు అయింది.
ALSO READ: త్రివిక్రమ్ కి అంబటి హెచ్చరిక!