వరుణ్ ‘కథలు’ లీకవుతున్నాయా?

Varun Tej

కొత్త కథలు, కొత్త జానర్స్ లో సినిమాలు చెయ్యాలనేది వరుణ్ తేజ్ తాపత్రయం. మిగతా హీరోల్లా తాను కూడా మాస్ సినిమాలు చేస్తే నిలబడలేను అని, తనకు వేరే పంథా కావాలని మొదటి నుంచీ ప్రయత్నిస్తున్నారు. “అంతరిక్షం” వంటి సినిమాలు చేసింది అందుకే.

ఐతే,ఇటీవల అతను చేస్తున్న ప్రయోగాలు బెడిసికొడుతున్నాయి. తాను కొత్తగా ఉంటుంది అని ఒక సినిమా మొదలుపెడితే, ఆ సినిమా విడుదల అయ్యేసరికి దాదాపుగా అదే థీమ్ తో పలు సినిమాలు విడుదల అవుతున్నాయి. దాంతో “విలక్షణత” అనేది ఎగిరిపోతుంది.

దర్శకుడు ప్రవీణ్ సత్తార్ చెప్పిన స్పై ఏజెంట్ కథ విన్నప్పుడు వరుణ్ తేజ్ ఎక్సయిట్ అయ్యాడు. చేద్దామని ఒప్పుకున్నాడు. ఐతే, బడ్జెట్, ఇతర కారణాల వల్ల ఆ సినిమా చాలా కాలం మొదలు కాలేదు. ప్లానింగ్ లోనే చాలా కాలం గడిచిపోయింది. చివరికి “గాండీవధారి అర్జున” పేరుతో షూటింగ్ మొదలుపెట్టి విడుదల చేసే సమయానికి నిఖిల్ సిద్ధార్థ్ “స్పై”, అఖిల్ “ఏజెంట్” సినిమాలు విడుదల చేశారు. ఈ మూడు చిత్రాలు గోవిందా అనిపించుకున్నాయి. ఇక వరుణ్ తేజ్ కొత్తగా ట్రై చేద్దామనుకున్నది రోటీన్ అయిపోయింది.

ఈ మార్చి 1న విడుదలైన “ఆపరేషన్ వాలెంటైన్” పరిస్థితి కూడా అంతే. ఈ సినిమా కథని దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ కరోనా కాలంలో చెప్పాడు వరుణ్ తేజ్ కి. కానీ మొదలు కావడానికి చాలా టైం పట్టింది. మొత్తానికి అనేకసార్లు వాయిదాలు పడి మార్చి 1, 2024న విడుదలయింది. తీరా విడుదల అయ్యాక ఇది అచ్ఛంగా హృతిక్ రోషన్ నటించిన హిందీ మూవీ “ఫైటర్”లా ఉంది అనిపించుకుంది.

ALSO READ: ‘Thandel’ and ‘Matka’ get a shock from Amazon Prime

ఇప్పుడు “మట్కా” అనే సినిమాలో నటిస్తున్నాడు వరుణ్ తేజ్. ఒకప్పుడు మట్కా అనే ఒక గ్యాంబ్లింగ్ ఆట ఉండేది. ఆ ఆట, ఆ మాఫియా వ్యాపారం చుట్టూ రూపొందుతోన్న కథ. ఈ సినిమా గత ఏడాది మొదలైంది. కానీ ఇంకా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. తాజగా అమెజాన్ ప్రైమ్ విజయ్ వర్మ హీరోగా “మట్కా కింగ్” అనే ఒక సినిమాని ప్రకటించింది. అది గనుక వరుణ్ తేజ్ సినిమా కన్నా ముందే అమెజాన్ లో స్ట్రీమ్ ఐతే అంతే సంగతులు.

 

More

Related Stories