దృశ్యం 2 – తెలుగు రివ్యూ

Drushyam 2

పోలీస్ స్టేషన్ సీన్ తో దృశ్యం సినిమా ఎండ్ అవుతుంది. పోలీస్ స్టేషన్ మధ్యలో మృతదేహాన్ని పాతిపెట్టడం అనే ఎపిసోడ్ తో అది ముగుస్తుంది. సరిగ్గా అక్కడ్నుంచే దృశ్యం-2ను స్టార్ట్ చేశారు. అదే ఈ సీక్వెల్ కు పెద్ద ప్లస్ పాయింట్. నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో రాంబాబు (వెంకటేష్) డెడ్ బాడీని పాతిపెట్టి, చేతిలో పారతో బయటకొచ్చే సీన్ ను ఓ సాక్షి చూస్తాడు. ఈ సీన్ నుంచే సినిమాపై ఆసక్తిని రేకెత్తించాడు దర్శకుడు జీతూ జోసెఫ్.  

సీక్వెల్ కాబట్టి కథను సూక్ష్మంగా చెప్పుకుందాం. రాంబాబు(వెంకటేష్), జ్యోతి(మీనా), అంజు(కృతిక), అను(ఎస్తర్) పాత్రల గురించి అందరికీ తెలిసిందే. సీక్వెల్ లో వీళ్ల కుటుంబ పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. థియేటర్ ఓనర్ అవుతాడు రాంబాబు. ఓ సినిమా నిర్మించే ప్లాన్ లో కూడా ఉంటాడు. అయితే ఆర్థికంగా ఎదిగినా, ఆరేళ్ల కిందట జరిగిన ఆ ఘటన మాత్రం వీళ్లను వెంటాడుతూనే ఉంటుంది. బిడ్డను పోగొట్టుకున్న ఐజీ గీతా ప్రభాకర్ (నదియా), ఆమె భర్త ప్రభాకర్ (నరేష్) యూఎస్ లో సెటిల్ అవుతారు. బిడ్డ శవం దొరుకుతుందేమో అనే ఆశతో ప్రభాకర్ తరుచుగా గ్రామానికి వస్తుంటాడు. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన ఐజీ (సంపత్ రాజ్) ఆ పాత కేసును మళ్లీ ఓపెన్ చేయిస్తాడు. సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఇక అక్కడ్నుంచి రాంబాబు కుటుంబానికి మళ్లీ సవాళ్లు ఎదురవుతాయి. వాటిని రాంబాబు తన తెలివైన బుర్రతో ఎలా అధిగమించాడు, తన కుటుంబాన్ని మరోసారి ఎలా కాపాడుకున్నాడనేది దృశ్యం-2 కథ.

సాధారణ కేబుల్ టీవీ ఆపరేటర్ నుంచి థియేటర్ యజమానిగా మారిన రాంబాబు, అదే క్రమంలో నిర్మాతగా కూడా మారాలనుకుంటాడు. దానికి సంబంధించి స్క్రిప్ట్ సెషన్స్ లో కూర్చుంటాడు. రాంబాబు పాత్రను, ఆ హ్యాంగోవర్ మొత్తాన్ని బాగా డెవలప్ చేశారు. దీంతో పాటు సాక్షి, రాంబాబుకు సమస్యగా మారతాడు. అంతేకాకుండా, తన ఫిలిం ప్రొడక్షన్ కు మిస్టరీకి లింక్ కూడా ఉండడం ఎంగేజింగ్ అనిపిస్తుంది.

సీక్వెల్ కోసం దర్శకుడు జీతూ జోసెఫ్ తెలివైన స్క్రిప్ట్ రాసుకున్నాడు. ప్రస్తుత కథకు, పాత సినిమా ఛాయల్ని బాగా మిక్స్ చేశాడు. రాంబాబు తెలివితేటలు, ఎమోషన్స్ తో ఫస్ట్ పార్ట్ సాగిపోతుంది. సెకెండాఫ్ లో ఎమోషన్ మిస్సయినప్పటికీ.. జీతూ జోసెఫ్ రాసుకున్న తెలివైన స్క్రీన్ ప్లే మనల్ని ఎంగేజ్ చేస్తుంది. ఎక్కడికక్కడ కథలో లాక్స్ వేస్తూ, క్లైమాక్స్ వరకు తీసుకెళ్లిన విధానం బాగుంది. ఈ విషయంలో జీతూ ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. మలయాళం వెర్షన్ లో తీసింది యాజ్ ఇటీజ్ గా షాట్ బై షాట్ తెలుగుకు కూడా ఫాలో అయిపోయాడు.

మలయాళం వెర్షన్ చూడకుండా, ఫ్రెష్ గా తెలుగు దృశ్యం-2 చూసిన ఆడియన్స్ మాత్రం ఈ స్క్రీన్ ప్లే కు ఫిదా అయిపోతారు. ఎండ్ కార్డ్ వరకు సినిమాను ఆస్వాదిస్తారు. మలయాళం వెర్షన్ ఆల్రెడీ చూసేసిన జనాలకు మాత్రం ఆ  ఎక్సయిట్ మెంట్ మిస్ అవుద్ది.

అయితే సినిమా బాగున్నప్పటికీ, మొదటి భాగంతో కంపార్ చేసి ఎక్కువగా ఊహించుకుంటే మాత్రం నిరాశ తప్పదు. మొదటి భాగంలో రాంబాబు పాత్ర తన తెలివితేటలు మొత్తం చూపిస్తుంది. బ్రిలియంట్ ట్రిక్స్ కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా పోలీస్ స్టేషన్ మధ్యలో శవాన్ని పాతే సీన్ అయితే ప్రేక్షకుడు కలలో కూడా ఊహించడు. ఆ స్థాయి తెలివితేటల్ని, ట్రిక్స్ ను పార్ట్-2లో రాంబాబు చూపించలేకపోయాడు. అయినప్పటికీ ఇంతకుముందే చెప్పుకున్నట్టు బోర్ కొట్టించడు.

పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే వెంకటేష్, మీన, నదియా తమ పాత్రలకు మరోసారి పూర్తి న్యాయం చేశారు. మోహన్ లాల్ తో వెంకీని పోల్చలేం కానీ, తన స్థాయిలో ఈ సినిమాను తన భుజాలపై బాగానే మోశాడు. టెక్నికల్ గా చూసుకుంటే రమేష్ సామల డైలాగ్స్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. దర్శకుడిగా, రచయితగా జీతూ జోసెఫ్ కు ఫుల్ మార్కులు పడతాయి.

బాటమ్ లైన్: ఓవరాల్ గా దృశ్యం-2 సినిమా సాలిడ్ స్క్రీన్ ప్లే, గ్రిప్పింగ్ నెరేషన్ తో మంచి థ్రిల్లర్ అనిపించుకుంటుంది. కాకపోతే మలయాళం వెర్షన్ రేంజ్ లో ఆకట్టుకోదు. ఇంట్లో కూర్చొని ఓటిటిలో చూడదగ్గ డీసెంట్ థ్రిల్లర్. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది.

Rating: 2.75/5

By పంచ్ పట్నాయక్

Also Read: Drushyam 2 Review: Engaging enough but…

 

More

Related Stories