కొండపొలం – తెలుగు రివ్యూ

రీమేక్ చేసినప్పుడు ఎలాంటి కష్టాలుంటాయో, ఓ నవలను సినిమాగా మలిచినప్పుడు కూడా అలాంటి కష్టాలే ఉంటాయి. ఉన్నదున్నట్టు తీస్తే ఓ బాధ, మార్పుచేర్పులు చేస్తే మరో బాధ. ఏది పెట్టాలి, ఏది తీయాలి అనేది దర్శకుడికే థాట్ ప్రాసెస్ ని బట్టి ఆధారపడి ఉంటుంది.

“కొండపొలం” సినిమాలో కూడా ఈ మీమాంస కనిపించింది. “కొండపొలం” అనే నవల చదివిన వాళ్లను ఇది నిజాయితీగా తీసిన సినిమా అనిపిస్తుంది. నవలతో సంబంధం లేకుండా సగటు ప్రేక్షకుడిగా సినిమా చూసిన వాళ్లకు ”ఇంకా సరిగ్గా ఉంటే బాగుణ్ను” అనే ఫీలింగ్ వస్తుంది.

క్రిష్ మాత్రం మార్పుచేర్పులు తక్కువే చేశాడు. ఓబులమ్మ పాత్రను యాడ్ చేయడమే అతడు చేసిన పెద్ద మార్పు. కానీ అదే సమయంలో పుస్తకంలోని కొన్ని మంచి డైలాగ్స్ ను, మరికొన్ని మంచి పేజీల్ని (సన్నివేశాలు లేదా ఎపిసోడ్స్) మిస్ కొట్టాడు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు పుస్తకం చదివిన వాళ్లకు ఆ వెలితి కనిపిస్తుంది. ఓవరాల్ గా క్రిష్ మాత్రం ఈ కొండపొలాన్ని ఓ పర్సనాల్టీ డెవలప్ మెంట్ గా, సెల్ఫ్ హెల్ప్ గైడ్ గా తీశాడు. జీవితంలో ఏదైనా సాధించాలనుకునేవాళ్లు రవీంద్ర నాయక్ పాత్ర నుంచి స్ఫూర్తి పొందొచ్చు.

నిజానికి కొండపొలం అనే పదం/కాన్సెప్ట్ చాలామందికి కొత్త. కర్నూలు, కడప, మహబూబ్ నగర్ జిల్లా వాసులకు కాస్త పరిచయం ఉన్న కాన్సెప్ట్ ఇది. ఇలాంటి కథ ఇప్పటివరకు వెండితెరకెక్కలేదు. అందుకే కొండపొలం కొత్తగా అనిపిస్తుంది. ఇందులో ఓ కొత్త రకం స్టోరీతో పాటు ఎడ్వెంచర్ థ్రిల్లర్, స్ఫూర్తినిచ్చే డ్రామా కనిపిస్తాయి.

కథ విషయానికొస్తే.. నల్లమల అటవీప్రాంతంలో పుట్టిపెరిగిన రవీంద్ర యాదవ్ (పంజా వైష్ణవ్ తేజ్) బాగానే చదువుకుంటాడు. కానీ తన గ్రామీణ/అటవీ నేపథ్యం కారణంగా ఇంటర్వ్యూల్లో చతికిలపడుతుంటాడు. ఆత్మన్యూనత వేధిస్తుంది. ఇంగ్లిష్ రాకపోవడంతో ఇబ్బందులు పడుతుంటాడు. అలా నాలుగేళ్ల పాటు ఇంటర్వ్యూల్లో వరుసగా ఫెయిల్ అయి, చివరికి తాత సలహా మేరకు కొండపొలం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. తండ్రితో కలిసి కొండపొలం చేయడానికి వెళ్తాడు. కరువు కాలంలో గొర్రెల మందకు మేత, నీరు సమస్య ఉంటుంది. దాన్ని అధిగమించడం కోసం మందను తోలుకొని కొండపైకి వెళ్తారు. దాదాపు 40 రోజుల పాటు కొండపైనే ఉండి, తిరిగి ఇంటికొస్తారు. దీన్నే కొండపొలం చేయడం అంటారు.

అలా కొండపొలం కోసం వెళ్లిన హీరో.. అడవి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుంటాడు. మరో మందతో కలిసి కొండపొలానికి వచ్చిన ఓబులమ్మ నుంచి ప్రేమను పొందుతాడు. రవీంద్ర యాదవ్ అడవి తల్లి నుంచి ఎలాంటి జీవిత పాఠాలు నేర్చుకున్నాడు.. తనను తాను కొత్తగా ఎలా ఆవిష్కరించుకున్నాడు. పూర్తి ఆత్మవిశ్వాసాన్ని పొంది ఎలా ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారి అయ్యాడు అనేది మిగతా సినిమా.

రాయలసీమలోని ఓ వెనకబడిన ప్రాంతానికి చెందిన ఓ గొర్రెల కాపరి, తనలోని లోపాల్ని అధిగమించి ఎలా ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ కాగలిగాడు అనేది కొండపొలం కథ. ఈ కథను ఇప్పటితరానికి తగ్గట్టు తీయడంలో కొంత క్రిష్ సక్సెస్ అయ్యాడు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు స్టోరీ ఈ సినిమాకు మెయిన్ హైలెట్. టైగర్ ఎపిసోడ్, సెకండాఫ్ లో హీరో ట్రాక్ కూడా హైలెట్స్ గా నిలుస్తాయి. ప్రారంభంలో చాలా తడబాటు పడ్డా… క్రిష్ సెకెండాఫ్ ను కొంత పక్డ్బందీగానే రాసుకున్నాడు.

హీరో ఉద్యోగ సమస్య, కొండపొలం వెళ్లే దారిలో సన్నివేశాలు చెప్పడానికి క్రిష్ చాలా టైమ్ తీసుకున్నాడు. ఈ దశ దాటిన తర్వాత సినిమాను ఇంట్రెస్టింగ్ గా మలిచాడు. అయితే సినిమాలో కరువు పరిస్థితుల్ని చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. చుట్టూ పచ్చదనం కనిపించడం వల్ల, కరువు వల్లనే హీరో కొండపొలం చేయడానికి వెళ్తున్నాడనే ఫీల్ కలగదు. అడవి పచ్చగానే ఉంటుంది. కానీ అడవికి, సీమలో కరువు పరిస్థితులకు మధ్య విజువల్ తేడాను స్పష్టంగా చూపించాలి కదా. ఇదొక మైనస్ పాయింట్ అనుకుంటే.. రవిప్రకాష్ పాత్ర మరో మైనస్. ఆ క్యారెక్టర్ తో కనెక్ట్ దొరకదు. మరీ ముఖ్యంగా టెలిఫోన్ బూత్ ఎపిసోడ్ అయితే అస్సలు కన్విన్సింగ్ గా అనిపించదు. స్లో నెరేషన్ తో పాటు ఇవి ప్రధాన లోపాలుగా కనిపిస్తాయి.

ఈ మైనస్ పాయింట్స్ పక్కనపెడితే.. రవి యాదవ్ గా వైష్ణవ్ తేజ్ చాలా బాగా చేశాడు. సీమ యాస్ అయితే దించేశాడంతే. అటు రకుల్ కూడా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తొలిసారి డీ-గ్లామర్ రోల్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఓబులమ్మగా మెప్పించింది.

జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ, కీరవాణి మ్యూజిక్ అదనపు బలాలు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి డైలాగ్స్ బాగున్నాయి.

దర్శకుడిగా క్రిష్ మరోసారి తన పనితనం చూపించాడు. కాకపోతే కరోనా పరిస్థితుల వల్ల నల్లమల అడవుల్లో తీయాల్సిన సినిమాను వికారాబాద్ అడవుల్లో తీశాడు. మరింత మంది సిబ్బంది, మరిన్ని పనిదినాలు దొరికి, అచ్చమైన నల్లమలలో, పుస్తకంలో చెప్పిన సిసలైన సీమలో సినిమా తీసి ఉంటే ఔట్ పుట్ మరోలా ఉండేది.

ఓవరాల్ గా నవల ఆధారంగా తెరకెక్కిన కొండపొలం ఓ కొత్తరకం కథను తెలుగు ఆడియన్స్ కు పరిచయం చేస్తుంది. కొత్త కథ చెప్పాలన్న తపనని అభినందించాల్సిందే. కానీ దాన్నిమరింత రక్తి కట్టేలా, స్పీడ్ నేరేషన్ తో చెప్తే బాగుండేది.

Rating: 2.75/5

Advertisement
 

More

Related Stories