బన్నీతోనా? మళ్ళీ షారుక్ తోనేనా?

దర్శకుడు అట్లీ కుమార్ పేరు ఇప్పుడు ఇండియన్ సినిమా రంగంలో మార్మోగిపోతోంది. “జవాన్” సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తోంది. పక్కా మాస్ సినిమా తీసి షారుక్ ఖాన్ కి భారీ విజయాన్ని అందించాడు అట్లీ. ఇప్పుడు, అందరి దృష్టి అతనిపై పడింది.

ఆ మధ్య ఎన్టీఆర్, బన్నీలతో సినిమాలు ప్లాన్ చేశాడు అట్లీ. కానీ సెట్ కాలేదు. తాజాగా అల్లు అర్జున్ తో సినిమా ఓకె కానుంది అని టాక్ ఉంది. ఐతే, ఇప్పుడు అట్లీ కుమార్ రేంజ్ ఏంటంటే ఆయన ఫిక్స్ చేసుకోవాలి… హీరోలు కాదు. సో, అట్లీ బన్నీతో చేస్తాడా లేక మళ్ళీ షారుక్ తో చేస్తాడా అనేది ఇప్పుడే చెప్పలేం.

అట్లీకి విజయ్ తో కూడా సినిమా ఉంది. నిజానికి విజయ్, అట్లీ స్నేహబంధం ప్రత్యేకం. విజయ్ తో వరుసగా మూడు సినిమాలు తీసి హిట్స్ కొట్టాడు అట్లీ. విజయ్ త్వరలోనే దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్లో ఒక మూవీ చెయనున్నాడు. ఆ తర్వాత ఏ సినిమా తీయాలో ఇంకా విజయ్ ఫిక్స్ కాలేదు. బహుశా అట్లీకి మరోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.

ఒకవేళ, షారుక్ ఖాన్ “జవాన్”కి సీక్వెల్ చేసేద్దాం అని అన్నారు అంటే అట్లీ బాలీవుడ్ లోనే మరో రెండేళ్లు ఉండాల్సి ఉంటుంది. “జవాన్ 2” స్విస్ బ్యాంకుల్లో భారతీయ కుబేరులు దాచిన నల్లధనంపై ఫోకస్ పెడుతుంది. ఆ విధంగా హింట్స్ కూడా “జవాన్”లోనే కనిపించాయి. సో, అట్లీకి పాయింట్ రెడీగా ఉంది “జవాన్ 2″చేసేందుకు.

ఐతే, అట్లీ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. బన్నీ ఇప్పుడు నేను చేస్తాను అనగానే వచ్చేంత పరిస్థితిలో లేరు అట్లీ. అతనే డిమాండ్ లో ఉన్నాడు మరి.

Advertisement
 

More

Related Stories