
‘ది ప్యారడైజ్’ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఒక పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఒక్క పాటకే కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇక సినిమా బడ్జెట్ కూడా 150 కోట్లపైనే దాటేలా ఉందట.
నాని కెరీర్ లో ఇదే అత్యంత హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రం. నానికి ఇటీవల ఎక్కువ సక్సెస్ లు దక్కాయి. అతని సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఐతే ఈ బడ్జెట్ మాత్రం నిర్మాతకు బర్డెన్ అనే చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ మంచి అమౌంట్ కి కొనుగోలు చేసింది. ఇది నిర్మాతకు మంచి బఫర్ లాభం.
ఐతే, పెట్టిన బడ్జెట్ మొత్తం రావాలంటే థియేటర్ల నుంచి కూడా దాదాపు 80 కోట్ల వరకు రాబట్టుకోవాలి. తెలుగుతో పాటు, హిందీ నుంచి కూడా ఎక్కువ మొత్తం వస్తుంది అని నాని భావిస్తున్నాడు. కానీ ఇంతవరకు నానికి తెలుగులో మరో భాషలో ముఖ్యంగా హిందీలో కనీస ఓపెనింగ్ లేదు.
ఇటీవల నాని నటించిన అన్ని సినిమాలు హిందీలో విడుదల అయ్యాయి. నాని వాటిని హిందీలో ప్రమోట్ చేశాడు. కానీ వచ్చింది మాత్రం ఏమి లేదు. కానీ తన ‘పాన్ ఇండియా’ కల, అలాగే ఈ బడ్జెట్ రికవరీ ఈ ‘ప్యారడైజ్’తో తీరుతుంది అని నాని భావిస్తున్నాడు.
ది ప్యారడైజ్ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. అతనికి ఇది రెండో చిత్రం. ఇంతకుముందు ‘దసరా’ చిత్రాన్ని తీశాడు. కాయదు లోహర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చి 26న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.
