
హీరోయిన్ నయనతార (Nayanthara) లాంగ్ గ్యాప్ తీసుకుంది. కేవలం ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాదు, తన వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆమె ఇటలీ వెళ్లింది. కుటంబంతో కలిసి వెనిస్ లో పర్యటించిన ఆమె, అక్కడే తన పెళ్లి రోజును ఘనంగా జరుపుకుంది.
ఈరోజు (జూన్ 9) మా పెళ్లి రోజు అంటూ నయన్ పెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భర్త విఘ్నేశ్ శివన్, కవల పిల్లలు ఉయిర్, ఉలగ్ తో కలిసి వెనిస్ వీధుల్లో విహరిస్తోంది నయనతార. ఆమె దుస్తులు, స్టయిల్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
దాదాపు నాలుగేళ్లు ప్రేమించుకున్న తర్వాత 2022 జూన్ 9న పెళ్లి చేసుకున్నారు నయనతార-విఘ్నేశ్ శివన్. అయితే పెళ్లి టైమ్ కే వాళ్లు పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నారు. దుబాయ్ లో సరోగసీ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అలా పెళ్లయిన కొన్ని నెలలకే కవలలకు తల్లిదండ్రులుగా మారారు నయనతార-విఘ్నేష్ దంపతులు. ఆ టైమ్ లో వాళ్లు చేసిన పనిపై చాలా విమర్శలు, వివాదాలు చెలరేగినప్పటికీ వాళ్లు తగ్గలేదు. అంతా చట్టరీత్యా చేసినట్టు చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఆ ఇద్దరు పిల్లలు, భర్తతో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది నయన్. ఆమె ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన హిందీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాని దిల్ రాజ్ నిర్మిస్తుండగా, వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు.
