
తమన్ మొన్నటివరకు అన్ని పెద్ద సినిమాలకు తానే అన్నట్లుగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా పోతున్నాయి. ఒకవైపు అనిరుధ్ రవిచందర్ బడా పాన్ ఇండియన్ సినిమాలను లాగేసుకుంటున్నాడు. మరోవైపు, హర్షవర్ధన్ రామేశ్వర్ (అర్జున్ రెడ్డి, యానిమల్ ఫేమ్) రైజ్ అయ్యాడు. ఇక భీమ్స్ వరుసగా హిట్స్ ఇస్తూ అతను బిగ్ లీగ్ కి వచ్చాడు.
మరోవైపు కన్నడ సినిమా నుంచి రవి బస్రుర్, అజనీష్ లోకనాథ్, తమిళం నుంచి జీవి ప్రకాష్ కుమార్, మలయాళం నుంచి ఒకరిద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు అనేక తెలుగు సినిమాలను లాగేసుకున్నారు. ఇక దేవిశ్రీప్రసాద్ సుకుమార్ వంటి పెద్ద దర్శకులకు, కీరవాణి రాజమౌళి చిత్రాలకు పర్మినెంట్ గా వర్క్ చేస్తున్నారు.
దాంతో, తమన్ కి గడ్డుకాలం స్టార్ట్ అయింది.
త్రివిక్రమ్ ప్రస్తుతం తాను డైరెక్ట్ చేస్తున్న “ఆదర్శ కుటుంబం” చిత్రానికి హర్షవరన్ రామేశ్వర్ ని తీసుకున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ తీసే “గాడ్ ఆఫ్ వార్” చిత్రానికి కూడా తమన్ పని చేసే అవకాశం లేదు. ఇక అల్లు అర్జున్ – అట్లీ చిత్రానికి ‘డ్యూడ్’ ఫేమ్ సాయి అభయంకర్ సంగీతం అందిస్తుండగా, అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నారు.
ప్రభాస్ – సందీప్ వంగా “స్పిరిట్” చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, ప్రభాస్ – హను రాఘవపూడి చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఇస్తున్నారు. ప్రభాస్ త్వరలో ప్రారంభించే “కల్కి 2″కి సంతోష్ నారాయణన్ సంగీతం ఇస్తున్నారు.
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ చిత్రానికి రవి బస్రుర్ మ్యూజిక్ డైరెక్టర్. రామ్ చరణ్ “పెద్ది” చిత్రానికి ఏ. ఆర్. రెహమాన్ సంగీతం ఇస్తుండగా, చిరంజీవి తదుపరి చిత్రానికి కూడా రెహమాన్ పనిచేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్”కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. రామ్ చరణ్ – సుకుమార్ చిత్రానికి కూడా దేవిశ్రీ ప్రసాద్.
ఒక్క బాలయ్య చిత్రాలు తప్ప తమన్ చేతిలో పెద్ద హీరో సినిమాలు లేవు ఇప్పుడు.
