
బాహుబలి సినిమాలతో రెండు భాగాల చిత్రాలకు క్రేజ్ తెచ్చారు రాజమౌళి (Rajamouli). ఒక్క పార్ట్ లో కథ చెప్పలేనని, రెండు భాగాలుగా మార్చారు రాజమౌళి. దాంతో, బాహుబలి 2కి విపరీతమైన క్రేజ్ వచ్చి ఆల్ టైం హిట్టయింది. ఆ తర్వాత అందరూ అదే పద్దతి ఫాలో అయ్యారు. అందులో “కేజీఎఫ్”, “కాంతార”, “పుష్ప”, “ధురంధర్” సినిమాలు భారీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. “సలార్”, “కల్కి”, “దేవర” సినిమాలను కూడా రెండుగా విభజించినా రెండో భాగాలు ఇంకా విడుదల కాలేదు.
కానీ, రాజమౌళి మాత్రం కథలో అంత మేటర్ లేనప్పుడు రెండు భాగాలుగా ఎందుకు తీయాలి అని “ఆర్ ఆర్ ఆర్” సినిమాని కేవలం ఒక భాగంగానే విడుదల చేసి ఆస్కార్ దాకా వెళ్లారు. అలాగే తాజాగా తీస్తున్న “వారణాసి”(Varanasi) సినిమా కూడా సింగిల్ పార్ట్ గానే విడుదల అవుతుంది అని ప్రకటించారు. ఒక టైంలో రెండు భాగాలు చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించినా ఆ తర్వాత ఆ ప్లాన్ ని పక్కన పెట్టి సోలో సినిమాగానే తీస్తున్నామని చెప్పారు.
ఐతే, ఇప్పుడు బాలీవుడ్ వెబ్ సైట్స్ మళ్ళీ “వారణాసి” రెండు భాగాలుగా రానుంది అంటూ ప్రచారం చేస్తున్నాయి. “ధురంధర్ 2″కి వచ్చిన క్రేజ్, ఓపెనింగ్ చూసి అందరూ మతులు పోయాయి. రాజమౌళి కూడా ఇప్పుడు తన మనసు మార్చుకొని “వారణాసి”ని రెండు భాగాలుగా విడుదల చేస్తారని బాలీవుడ్ మీడియా అంటోంది.
ఐతే, రాజమౌళి టీం ఇప్పటివరకు స్పందించలేదు. దాదాపు సినిమా షూటింగ్ పూర్తి అవుతోన్న టైంలో సడెన్ గా ప్లాన్ మార్చి రెండు భాగాలుగా తీస్తారా? రాజమౌళి అలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది డౌటే.
ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.
