
తెలుగు రాష్ట్రాల్లోని చలనచిత్ర కళాకారులకు ప్రాతినిధ్యం వహించే ఏకైక అధికారిక సంస్థ తమదిమాత్రమేనని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) స్పష్టం చేసింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌తో అనుబంధం కలిగి ఉన్న ఏకైక అసోసియేషన్ ఇదేనని, పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌లతో సమన్వయం చేసుకుంటూ కళాకారుల సంక్షేమం కోసం పని చేస్తున్నామని పేర్కొంది ‘మా’.
ఈమధ్య “AP MAA”, “MAA AP” వంటి పేర్లతో కొన్ని అనధికారిక సంస్థలు పుట్టుకొచ్చినట్లు ‘మా’ దృష్టికి వచ్చింది. ఈ నకిలీ సంస్థలు అసలైన ‘మా’ పేరును వాడుకుంటూ కళాకారులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ‘మా’ ఆందోళన వ్యక్తం చేసింది.
ముఖ్యంగా, ఈ అనధికారిక వ్యక్తులు కళాకారుల నుండి సభ్యత్వాల పేరుతో చట్టవిరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ‘మా’ కు సమాచారం అందింది. తాము ఎవరికీ ఇలాంటి వసూళ్ల కోసం అనుమతి ఇవ్వలేదని, తమ పేరును వాడుకుని ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ‘మా’.
కళాకారులు, పరిశ్రమ సభ్యులు ఇలాంటి మోసపూరిత సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారికి ఎలాంటి రుసుము చెల్లించవద్దని ‘మా’ విజ్ఞప్తి చేసింది. ఏదైనా డౌట్ ఉంటే హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న ‘మా’ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించండి అంటున్నారు.
